బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి సునక్

By Sandra Ashok KumarFirst Published Feb 14, 2020, 11:20 AM IST
Highlights

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి సునక్ అత్యంత సన్నిహితులు.

లండన్: భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ సిఫారసును బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆమోదించారని బ్రిటన్ ఆర్థిక శాఖ తెలిపింది. బ్రిటన్‌లో అత్యున్నత స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్న రిషి సునక్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లో కలిసి పని చేయనున్నారు. 

బ్రిటన్‌లో ప్రధానమంత్రి పదవి తర్వాత ఆర్థికశాఖ మంత్రి పదవి అత్యంత కీలకమైంది. దీంతో ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ గదికి పక్కన ఉన్న గదిని సునక్‌కు కేటాయిస్తారు. రిషి సునక్‌ను ఆర్థికశాఖ మంత్రిగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడానికి ముందు ఆ శాఖ మంత్రిగా పాకిస్థాన్ జాతీయుడైన సాజిద్ జావిద్ రాజీనామా చేశారు. 

also read "ప్రేమలో పడిపోయాను, దాదాపు పెళ్లి కూడా...": రతన్ టాటా

రిషి సునక్ బ్రిటన్ లో జన్మించారు. తల్లి ఫార్మసిస్టు కాగా, తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)లో జనరల్ ప్రాక్టీషనర్‌గా పని చేశారు. రిషి సునక్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు ఒక బిలియన్ పౌండ్లతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థను స్థాపించారు. 

బ్రిటన్‌లో చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టడంలో రిషి సునక్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. బ్రిటన్ లో చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తే బ్రిటన్ నుంచి బయట పడవచ్చునని ఆయన భావించారు. 

బ్రిటన్‌లో నిర్వహిస్తున్న పలు వ్యాపారాలకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో సంబంధం లేదు. అయినా ఈయూ చట్టాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని రిషి సునక్ వాదిస్తూ వచ్చారు. 

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు రిషి సునక్ అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. యార్క్ షైర్ లోని రిచ్మండ్ నుంచి 2015లో తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై బ్రిటన్ పార్లమెంట్‌లో రిషి సునక్ అడుగు పెట్టారు. 

రిషి సునక్ అధికార కన్జర్వేటివ్ పార్టీలో వేగంగా ఎదిగి పోయారు. బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటపడేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ అనునరించిన వ్యూహాత్మక విధానాలకు మద్దతుగా నిలిచారు. 

also read ఆ ఇంటి కోసం ఏకంగా రూ.1150 కోట్లు వెచ్చించాడు....

తల్లి నడుపుతున్న చిన్న కెమిస్ట్ షాపు నుంచి అతి పెద్ద వ్యాపారం నిర్మాణంలో తనకు అనుభవం ఉన్నదని రిషి సునక్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ భవిష్యత్‌ను ధ్రుడంగా నిర్మించడంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో తనకు తెలుసునని బ్రెగ్జిట్ రెఫరెండం సమయంలోనే మాట్లాడుతూ సునక్ చెప్పారు.  

ఇదిలా ఉంటే, ఈ వారంలోనే ప్రధాని బోరిస్ జాన్సన్ తన మంత్రి వర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించనున్నారు. ఈ దఫా జరిగే పునర్వ్యవస్థీకరణలో భారత సంతతికి చెందిన ఎంపీలు అలోక్ శర్మ, సుల్లే బ్రావెర్ మాన్, తదితర ఎంపీలకు కీలక పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని బోరిస్ జాన్సన్ కొందరికి ఉద్వాసన పలుకనుండగా, మరికొందరు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

click me!