
ముంబై: ఆసియా ఖండంలోనే కుబేరుడు ముకేశ్ అంబానీ. ఆయన దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’కు చైర్మన్‌గా సారథ్యం వహిస్తున్నారు. అయినా ఆయనకు కొత్త చిక్కొచ్చి పడింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నూతన నిబంధనలు త్వరలో అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఒక కార్పొరేట్ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బాధ్యతలు వేర్వేరుగా ఉండాలి.
also read ఐసీఐసీఐ బ్యాంక్, మాజీ సీఈఓకి ఈడీ షాక్.....ఇల్లు, ఆస్తులను....
సెబీ నూతన నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో ముకేశ్ అంబానీ తన సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కోసం అన్వేషణ ప్రారంభించారు. దీని ప్రకారం ముకేశ్ అంబానీ రిలయన్స్ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ‘సెబీ’ నూతన మార్గదర్శకాలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది. ‘కంపెనీలో ఎంతోమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. వారిలో ముకేశ్ అంబానీ ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన వయస్సు రీత్యా ఎండీగా బాధ్యతలు స్వీకరించరాదని చట్టం చెబుతోంది. అలాగూ ఎండీగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి అంబానీ కుటుంబం నుంచి ఉండబోరు‘ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సెబీ కొత్త నిబంధనల ప్రకారం బోర్డ్ చైర్ పర్సన్‌గా ఉండే వ్యక్తి ఇకపై నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల పాలనను మెరుగు పరచడం సెబీ నూతన మార్గదర్శకాల ఉద్దేశం.
also read దిగోచ్చిన బంగారం, వెండి ధరలు...10 గ్రాములకు ఎంతంటే ?
ఇంతకుముందు ఉదయ్ కొటక్ సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ 2017లో తొలిసారి చైర్మన్, ఎండీ వేర్వేరుగా ఉండాలని ప్రతిపాదించింది. 2018లో దీనికి సెబీ ఆమోద ముద్ర వేసింది. మార్కెట్లో లిస్టయిన 500 కంపెనీలు రెండు సంవత్సరాల లోపు ఈ నిబంధనలను అనుసరించాలని పేర్కొన్నది.
అయితే కంపెనీలకు సెబీ మరికొంత సమయం ఇస్తుందా? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది. ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత రిలయన్స్ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకేశ్ అంబానీ.. సంస్థ ఎండీగా 1977 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.