రిలయన్స్ 30 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం: రైట్స్ ఇష్యూకు ముఖేశ్ అంబానీ

Ashok Kumar   | Asianet News
Published : Apr 29, 2020, 12:14 PM ISTUpdated : Apr 29, 2020, 10:02 PM IST
రిలయన్స్ 30 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం: రైట్స్ ఇష్యూకు ముఖేశ్ అంబానీ

సారాంశం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దడానికి ముకేశ్ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా సంస్థ 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి రైట్స్ ఇష్యూ జారీ చేయనున్నది. ఇప్పటికే ఫేస్ బుక్ సంస్థతో జియో ఒప్పందం ద్వారా రిలయన్స్ రూ.43 వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నది.  

ముంబై: ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సంచలన నిర్ణయం తీసుకున్నది. సంస్థ ఏర్పాటైన 30 సంవత్సరాల్లో తొలిసారి రైట్స్ ఇష్యూకి వస్తున్నట్టు ప్రకటించింది. మార్కెట్ విలువలో దేశంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంధనం మొదలు టెక్నాలజీ వరకు రిలయన్స్ అంచెలంచెలుగా ఎదిగింది. 

వచ్చే ఏడాది నాటికి రుణరహిత కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. గతేడాది వార్షిక సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 2021 నాటికి తమ సంస్థను రుణ రహిత సంస్థగా రూపుదిద్దుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 30న కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో... రైట్స్ ఇష్యూ ప్రతిపాదనను పరిశీలించనున్నట్టు బీఎస్‌ఈ ఎక్స్చేంజ్ తాజా ఫైలింగ్‌లో ఆర్ఐఎల్  పేర్కొంది. కంపెనీ వద్దనున్న రైట్స్ ఇష్యూ ద్వారా ప్రస్తుత వాటాదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. 

also read వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్: సీరం ఇన్ స్టిట్యూట్...

కంపెనీలు తమ ఆర్థిక భారాల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన అదనపు నిధుల కోసం రైట్స్ ఇష్యూ ప్రకటిస్తాయి. కాగా గత కొద్ది వారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా ఫండ్ రైజింగ్ ప్రకటించడం దాదాపు ఇది మూడోసారి. 

ఇందులో భాగంగానే రిలయన్స్ జియో-ఫేస్‌బుక్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రిలయన్స్‌కు రూ.43 వేల కోట్లకు పైగా నిధులు లభించాయి. అయినప్పటికీ రుణాల భారం తొలగిపోవాలంటే కంపెనీకి ఇంకా రూ. 1.1 లక్షల కోట్లు అవసరం ఉందని మార్కెట్ నిపుణుడు సుదీప్ ఆనంద్ పేర్కొన్నారు. కాగా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా దాదాపు రూ.25 వేల కోట్ల మేర నిధులు సమీకరించనున్నట్టు ఈ నెల మొదట్లో కంపెనీ తెలిపింది.

కాగా మార్చి 2019 నాటికి కంపెనీకి 20 బిలియన్ డాలర్ల మేర రుణాలు ఉన్నాయనీ.. 2021 నాటికల్లా రుణరహిత కంపెనీగా అవతరించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముకేశ్ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 15 బిలియన్ డాలర్ల వాటా ఉన్న రిఫైనింగ్ అండ్ కెమికల్స్ యూనిట్‌‌ను సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీకి అమ్మాలన్నది ఈ వ్యూహంలో కీలక భాగం. అయితే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఇది పెండింగ్‌లో పడింది. 
 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !