లాక్‌డౌన్‌తో పెను ప్రమాదం తప్పినా నీరసించిన ఎకానమీ.. ఎస్‌బి‌ఐ ఛైర్మన్‌ అంగీకారం

By Sandra Ashok KumarFirst Published May 2, 2020, 11:40 AM IST
Highlights

కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం నీరసించిందని అంగీకరించారు.  

ముంబై: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజనీశ్‌ కుమార్‌ సమర్ధించారు. దీనివల్ల దేశానికి పెద్ద వేదన తప్పిందన్నారు. 

దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ నీరసించినా, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినా, అది దేశాన్ని పెద్ద బాధ నుంచి రక్షించిందని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తొలగించాలని తెలిపారు.

‘ప్రస్తుతం మనకి ఎంతో ఓర్పు అవసరం. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకుండా, పరిస్థితి పూర్తిగా అదుపులో రాకుండా భద్రతను తొలగించలేం. లాక్‌డౌన్‌ భారత దేశాన్ని అతిపెద్ద బాధ నుంచి కాపాడిందనే నా అభిప్రాయం’ అని రజనీశ్ కుమార్ తెలిపారు.

అలాగే కరోనా కేసుల సంఖ్యనూ లాక్‌డౌన్‌ తగ్గించింది. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. కానీ ఆర్ధిక వ్యవస్థకు ఉన్న డిమాండ్ తగ్గకుండా చూసుకుంటే, కార్యకలాపాలకు ఎలాంటి ప్రశ్నలూ తలెత్తవు’ అని రజనీశ్ కుమార్ అన్నారు. 

‘‘లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించేందుకు మనం ఇంకా కొద్ది రోజుల దూరంలో ఉన్నామని అనుకుంటున్నా. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల పరిస్థితి మెరుగుకాలేదు. అలాగే దేశవ్యాప్తంగా గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి’’ అని రజనీశ్‌ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరిస్తే, త్వరలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్నారు. 

కరోనా కేసుల సంఖ్య పెరగకుండా నిరోధించవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. రికవరీ రేటు 25 శాతం కన్నా ఎక్కువ ఉండటమే లాక్‌డౌన్‌ ఫలితాలు మనం పొందుతున్నామనే దానికి నిదర్శనం అని అన్నారు. 

‘వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చిందని నమ్మకం కుదిరే వరకు మనం పూర్తి అప్రమత్తతతో ఉండాలి. ఇందుకు మనకు సహనం కూడా ఉండాలి’ అన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు అంతంత మాత్రంగానే ఉంటాయని రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. 

అయితే డిమాండ్‌కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండక పోవచ్చునని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. సరుకుల సరఫరా గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదని చెప్పారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన విషయం నిజమని అన్నారు. 
 

click me!