వ్యాపారులు సాధారణంగా లాభాల్లో ఉన్న కంపెనీల కొనుగోలుకు వ్యాపారవేత్తలు ఎగబడతారు. కానీ, ఈయన మాత్రం పూర్తిగా భిన్నం. నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీలను చేజిక్కించుకొని తన నైపుణ్యం, వ్యాపార చతురతతో వాటిని లాభాల బాట పట్టిస్తారు.
న్యూఢిల్లీ: ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ పరిచయం అక్కర్లేని పేరు. ఉక్కు పరిశ్రమల రంగంలో ‘సుల్తాన్ ఆఫ్ టైకూన్’ అని పిలుచుకుంటారు. వ్యాపారులు సాధారణంగా లాభాల్లో ఉన్న కంపెనీల కొనుగోలుకు వ్యాపారవేత్తలు ఎగబడతారు. కానీ, ఈయన మాత్రం పూర్తిగా భిన్నం. నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీలను చేజిక్కించుకొని తన నైపుణ్యం, వ్యాపార చతురతతో వాటిని లాభాల బాట పట్టిస్తారు.
చిన్ననాడు కరెంటు, మంచినీటి వసతి కూడా లేని గ్రామం నుంచి ఈనాడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాజసౌధంలో నివసిస్తున్న స్థాయికి ఎదిగారు. కోల్‌కతాలో ప్రారంభమైన తన వ్యాపారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు సామ్రాజ్యంగా మార్చిన ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ గురించి తెలుసుకుందాం..
అందరికీ లక్ష్మీ మిట్టల్‌గానే తెలిసిన ఆయన పూర్తి పేరు లక్ష్మీ నారాయణ్ నివాస్ మిట్టల్. 1950 జూన్ 15వ తేదీన రాజస్థాన్ చురు జిల్లాలోని సాదుల్‌పూర్ అనే మారుమూల గ్రామంలో జన్మించారు. తనకు ఐదేళ్లు వచ్చే వరకు అక్కడే గడిపారు. కనీసం మంచినీరు, విద్యుత్ వసతి కూడా లేని రోజులవి. దీంతో పిల్లల భవిష్యత్తు కోసం తన తండ్రి మోహన్‌లాల్ మిట్టల్ కోల్‌కతాకు మకాం మార్చారు.
also read Tata motors: టాటా మోటార్స్ బంఫర్ ఆఫర్.. గిఫ్ట్‌గా రూ.5 లక్షల బంగారం
కోల్‌కతాలోనే లక్ష్మీ మిట్టల్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక సెయింట్ జేవియర్స్ కళాశాలలో బీకాం ప్రవేశం కోసం వెళ్లారు. అప్పటివరకు హిందీ మీడియంలో చదివిన మిట్టల్‌ను చేర్చుకోవడానికి ప్రిన్సిపల్ అంగీకరించలేదు.
ఇంగ్లిష్ మీడియంలో రాణించలేడని తిరస్కరించినా లక్ష్మీ మిట్టల్ పట్టువదలలేదు. తప్పకుండా మంచి మార్కులతో పాసవుతానని మాటిచ్చి కాలేజీలో ప్రవేశం పొందారు. పట్టుదలగా చదివి క్లాస్‌లో టాపర్‌గా నిలిచారు. హిందీ మాధ్యమంలో చదివి ఆంగ్లంలో రాణించలేరన్న ప్రిన్సిపల్ అపోహని తప్పని నిరూపించారు.
కోల్‌కతాకు మకాం మార్చిన తర్వాత జీవనోపాధి కోసం మోహన్‌లాల్ మిట్టల్ ఓ చిన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. ఉదయం 6గంటల నుంచి 9.30గంటల వరకు కాలేజీకి వెళ్లే లక్ష్మీ మిట్టల్ అనంతరం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉక్కు కర్మాగారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆయన వ్యాపార మెలకువల్ని నేర్చుకున్నారు.
ఇక చదువు పూర్తయిన తర్వాత తండ్రి బిజినెస్‌లో పూర్తిగా భాగం కావాలని అనుకున్నారు. తొలుత క్లర్క్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. యజమాని కొడుకునన్న భేషజాలు లేకుండా విధుల్లో భాగంగా తపాలా కార్యాలయానికి వెళ్లి ఉత్తరాలు కూడా పోస్ట్ చేసేవారు.
భారత్‌లో ప్రైవేటు రంగానికి అప్పటికి ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా మోహన్‌లాల్ మిట్టల్ విదేశాల వైపు తన దృష్టిసారించారు. అందులో భాగంగా ఇండోనేషియాలో భూమి కూడా కొన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించక ఆ దిశగా అడుగులు వేయలేదు.
అయితే ఓసారి లక్ష్మీ మిట్టల్ తన మిత్రులతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తండ్రితో చెప్పగా.. ఇండోనేషియాకు వెళ్లి అక్కడున్న భూమి అమ్మాలని పని పురమాయించాడు. దీంతో యాత్రలో భాగంగా అక్కడికి వెళ్లిన లక్ష్మీ మిట్టల్ అక్కడున్న అవకాశాలను పసిగట్టారు. వ్యాపారాన్ని నెలకొల్పడానికున్న ఏకైక సమస్య విద్యుత్‌ని పరిష్కరించారు. ఇదే విషయాన్ని భారత్‌కు తిరిగొచ్చి తండ్రికి చెప్పారు.
అలా తండ్రి మోహన్ లాల్ మిట్టల్ ప్రోత్సాహంతో విదేశీ గడ్డపై తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటికే ఉన్న ఒక పాత ఉక్కు కర్మాగారాన్ని కొని దాన్ని ఆధునీకీకరించారు. అలా ఇస్పాత్ ఇండస్ట్రీస్ పేరిట తొలి ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. అక్కడ ప్రారంభమైన తన వ్యాపారం నేడు ఆర్సెలార్ మిత్తల్ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది.
ట్రినిడాడ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న ఓ పెద్ద స్టీల్ కంపెనీని మిట్టల్ కుటుంబం 1989లో కొనుగోలు చేసింది. దాన్ని జర్మనీకి చెందిన ఓ గ్రూప్ నిర్వహిస్తుండేది. అప్పటికి అది రోజుకు దాదాపు ఒక మిలియన్ డాలర్ల నష్టాల్ని మూటగట్టుకుంటోంది. జర్మనీ, అమెరికా దేశాల నిపుణులు దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు.
కానీ, లక్ష్మీ మిట్టల్ మాత్రం దాని కొనుగోలుకు వెనుకాడలేదు. దాన్ని సొంతం చేసుకొని తన వ్యాపార చతురతతో లాభాల బాట పట్టించారు. అనంతరం మెక్సికో సైతం తమ కంపెనీల్ని కొనుగోలు చేయాలని మిట్టల్‌ని ఆశ్రయించిందంటే ఆయనకు ఆ రంగంపై ఉన్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా ప్రపంచంలో అతిపెద్ద స్టీల్ కంపెనీల్లో ఒకటిగా మిట్టల్ గ్రూప్ చేరింది.
విదేశాల్లో కొన్ని కంపెనీలు కొనుగోలు చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల కుటుంబం విడిపోయింది. అలా ఇస్పాత్ ఇండస్ట్రీస్ విదేశీ వ్యాపారాలన్నీ లక్ష్మీ మిటటల్ చేతికి వచ్చాయి. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అవకాశాలున్న ప్రతి చోట వాలిపోయారు.
ఎక్కడ స్టీల్ కంపెనీ నష్టాల్లో ఉన్నా దాన్ని కొనుగోలు చేశారు. అలా తన వ్యాపారాన్ని కెనడా, జర్మనీ, కజకిస్థాన్‌లకు స్వల్ప కాలంలోనే విస్తరించారు. అందరికంటే ముందు ఉండాలంటే భిన్నంగా ఆలోచించాలని, వేగంగా ఉండాలని ఆయన విశ్వసిస్తారు. కొత్తగా స్టీల్ ప్లాంట్లు నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఉన్న వాటిని కొనుగోలు చేసి ఆధునికీకరించడమే మేలైన మార్గమని ఆయన విశ్వసించారు.
తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళుతున్న మిట్టల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ‘ఇంటర్నేషనల్ స్టీల్ గ్రూప్’ని సొంతం చేసుకున్నారు. దీంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అలా ‘మిట్టల్ స్టీల్’ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా అవతరించింది. ఇదే క్రమంలో 2005లో ఉక్రెయిన్‌కి చెందిన ఓ స్టీల్ కంపెనీ కొనుగోలు చేయడంలో లక్సెంబర్గ్ కేంద్రంగా ఉన్న ఆర్సెలార్‌కి మిట్టల్ స్టీల్‌కి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కానీ, మార్కెట్ వర్గాల అంచనా కంటే భారీ మొత్తం చెల్లించి ఆ కంపెనీని మిత్తల్ సొంతం చేసుకున్నారు. ఇక భవిష్యత్తులో ఈ పోటీ ఉండొద్దని నిర్ణయించుకున్న మిట్టల్ ఆర్సెలార్‌నూ కొనుగోలు చేశారు. అలా 2006లో మిట్టల్ స్టీల్ ‘ఆర్సెలార్ మిట్టల్’గా మారి ప్రపంచ ఉక్కు చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదు చేసింది. ప్రస్తుతం ఏడాదికి 70మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రపంచ స్టీల్ అవసరాల్లో 10శాతం ఒక్క ఆర్సెలార్ మిట్టల్ గ్రూపే తీరుస్తోంది.
చూడ్డానికి నిరాడంబరంగా కనిపించే లక్ష్మీ మిట్టల్‌కి ఆడంబరాలంటే మక్కువ. లండన్‌లో ఆయన నివసించే వీధి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధిగా పేరుగాంచింది. ఇక ఆయన భవనం కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
2004లో దీన్ని దాదాపు రూ.560కోట్లకు ఫార్ములా వన్ మాజీ రేసర్ బెర్నీ ఎకాల్‌స్టన్ నుంచి కొనుగోలు చేశారు. 2004లో లక్ష్మీ మిట్టల్ కూతురు వినిషా మిట్టల్ వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. దాదాపు రూ.240కోట్లు ఖర్చు చేశారని చెబుతుంటారు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఇదొకటిగా పేర్కొంటారు.
also read డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు..మేలుకోకుంటే మీ డబ్బు మాయం
ఎంత ఆడంబరంగా ఉన్న సామాజిక బాధ్యతను మాత్రం మరవలేదు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు మిత్తల్ ఛాంపియన్ ట్రస్ట్ నెలకొల్పారు. 2008లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన అభినవ్ బింద్రాకు రూ.1.5కోట్లు ప్రోత్సాహకంగా అందజేశారు.
2012 ఒలిపింక్స్ కోసం నిర్మించిన ఆర్సెలార్ మిట్టల్ ఆర్బిట్‌కి ఉచితంగా స్టీల్ అందించారు. లక్ష్మీ మిట్టల్ ఆయన భార్య ఉషా మిట్టల్ పేరిట నెలకొల్పిన ఫౌండేషన్ ద్వారా రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఎల్‌ఎన్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీని జైపూర్‌లో నెలకొల్పారు. అలా విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు తన సేవల్ని విస్తరించారు.
ఇక నెమ్మదిగా ఆయన కుమారుడు ఆదిత్యకి వ్యాపార బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య.. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలా ఎక్కడో విద్యుత్తు, మంచినీటి సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామంలో ప్రారంభమైన లక్ష్మీ మిట్టల్ జీవితం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనంలో నివసించే స్థాయికి చేరింది. ఇది ఒక్కరోజులో సాధ్యమైన పని కాదు.
తన వ్యాపార చతురతతో దిగ్గజ కంపెనీల్ని సొంతం చేసుకోవడంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నష్టాల్లో మునిగి తేలుతున్న కంపెనీల్ని లాభాల బాట పట్టించారు. మొత్తానికి స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచి సుల్తాన్ ఆఫ్ స్టీల్ అనిపించుకున్నారు. భారతీయుల వ్యాపార చతురతని ప్రపంచానికి చాటిన వారిలో ఒకరిగా నిలిచారు.