డిజిటల్ చెల్లింపులపై మోజుకు తోడు రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ ఆధారిత స్కామ్‌లు ఆకర్షిస్తున్నాయి. కానీ అవగాహన లేక మోసాలపై ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. బ్యాంకులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతే ఉంటుందన్న విమర్శ ఉంది.
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల పట్ల ఆకర్షితులవుతున్న వారు వాటిపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారు. దేశంలో నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ సర్కార్ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) విధానాన్ని 2016లో అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తక్షణం బ్యాంకు ఖాతాలను నుంచి చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ విధానంపై సరిగ్గా అవగాహన లేని ప్రజలు వివిధ రకాల యూపీఐ మోసాల బారీన పడి తమ ఖతాల్లో సొమ్మును పొగొట్టుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఈ విషయమై సరిగ్గా అవగాహన కల్పించకపోవడంతో తెలిసి తెలియని విజ్ఞానంతో డిజిటల్ చెల్లింపు విధానానికి పోతున్న ప్రజలు ఆర్థిక మోసాల బారీన పడి లబోదిబోమంటున్నారు.
కేంద్రం అమలులోకి తెచ్చిన యూపీఐ విధానానికి ఎక్కువగా దేశంలోని యువత ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా 4జీ సౌకర్యం రావడం, స్మార్ట్ ఫోన్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యువత ఎక్కువగా ఈ తరహా లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఈ విధానంలో కనీసం రూపాయి లావాదేవీలు జరిపేందుకు, ఖాతాల్లోకి బదిలీ చేసుకునేందుకు వీలుండడంతో ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్ విధానాలకంటే కూడా యూపీఐపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
గత నెలలో యూపీఐ విధానంలో జరిపిన లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో వందకోట్ల స్థాయి మార్క్‌ను దాటేసింది. సౌలభ్యం కారణంగా యూపీఐ వేదికను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య దాదాపు 10 కోట్ల మార్కును దాటేసినట్టుగా సర్కారు తాజాగా వెల్లడించింది. అయితే ఇందులో ఎక్కువ మంది యూపీఐకి ఆకర్షితులవడానికి ప్రధాన కారణం క్యాష్‌బ్యాక్ ఆఫర్లేనని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఎప్పుడు చూసినా ఏటీఎంలు వట్టిపోయి ఉండడం, బ్యాంకు శాఖలు మూత పడుతున్న వేళ ప్రస్తుత బిజీ సమాజంలో సులభ లావాదేవీలకు ప్రజలు యూపీఐ విధానం పట్ల ఆకర్షితులవుతున్నారు. దీంతో మోసగాళ్లు తాజాగా యూపీఐ లావాదేవీలపై కన్నెసినట్టుగా నిఘా సంస్థలు చెబుతున్నాయి.
ప్రజలు తెలిసి తెలియని విజ్ఞానంతో తమ ఖాతాలను యూపీఐకి జోడించడం.. ఈ దిశగా వస్తున్న వివిధ రకాల ఎస్‌ఎంఎస్‌లు, ఇతర లింక్‌లను క్లిక్ చేస్తుండడంతో వారు తమ ఖాతాల్లో సొమ్మును.. తెలియకుండానే పొగొట్టుకుంటున్నారు. తీరా ఈ విషయం తెలుసుకొని లబోదిబోమంటున్న బ్యాంకుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.
ఆన్‌లైన్ పేమెంట్స్‌ను విశ్లేషిస్తున్న '''వర్చువల్ పేమెంట్స్'' నివేదిక ప్రకారం యూపీఐ వేదికపై జరుగుతున్న మోసాలను పరిశీలించి చూస్తే.. మొత్తం యూపీఐ లావాదేవీల్లో 3 నుంచి 5 శాతం వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఫిర్యాదుకు చేస్తున్న కేసులే వెలుగులోకి వస్తున్నాయని.. వెలుగులోకి రానివి ఇందుకు రెండు, మూడు రెట్టు ఉండనున్నాయని వారు చెబుతున్నారు.
ఖాతాదారులతో పాటుగా తమతమ వ్యాపారాలలో యూపీఐ చెల్లింపు విధానాన్ని అనుమతిస్తూ బిజినెస్ చేస్తున్న సంస్థలు కూడా ఈ తరహా మోసాలకు సొమ్ము కోల్పోతున్నట్ట తెలుస్తోంది. ఇలా తెలియకుండానే జరుగుతున్న మోసాలతో సొత్తు కోల్పోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.
ఈ విషయమై బ్యాంకులను ప్రశ్నిస్తే సరైన స్పందన ఉండడం లేదని. న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితులు ఉంటున్నాయని వారంటున్నారు. టెక్నాలజీపై ఎక్కువగా అవగాహన లేని వారి.. మహిళలు ఎక్కువగా ఈ తరహా మోసాలభారిన పడుతున్నట్టుగా నివేదికల ద్వారా తెలుస్తోంది.
స్కామ్‌స్టర్‌లు ఎక్కువగా ద్వితీయ శ్రేణి నగరాలలోని ప్రజలు, ఎక్కుగా టెక్నాలజీపై అవగాహన లేని వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజిటల్ వేదిక పైకి వచ్చినందుకు ఖాతాల్లో సొమ్ము మాయమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ లావాదేవీలపై దృష్టి సారించాలని చెబుతున్న సర్కారు ఇందుకు తగ్గ భద్రతా ప్రమాణాలను దేశంలో అమలులోకి తేలేకపో వడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రొత్స హించే ఆలోచనతో ఏటీఎంలు, బ్యాంక్ శాఖలను తగ్గించేస్తున్న సర్కారు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు తగ్గ మౌలిక వసతులను కల్పించకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
యూపీఐ మోసగాళ్లు బ్యాంకు అధికారులమంటూ నమ్మబలికి వచ్చే కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు ఎనీడెస్క్ థర్డ్ పార్టీ యాప్స్ లింక్‌లను పంపుతూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మోసగాళ్లు ఫోన్ చేసి యాప్ లో బగ్ ఉందని, మొబైల్ బ్యాంకింగ్ డిజేబుల్ అవుతుందని భయ పెట్టి.. ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొమ్మని సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ యాప్ మీ మొబైల్లో ఇన్ స్టాల్ చేస్తే.. హ్యాకర్ల కంట్రోల్లోకి మీ డివైజ్ వెళ్లిపోతుంది. కాబట్టి మీకు ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేయమంటే చేయొద్దు. ఏదైనా మీ అకౌంట్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఇవ్వొద్దు. మీ ఫోన్ నెంబర్లకు ఏదైనా అనుమానిత మెసేజ్ లేదా లింక్ వస్తే క్లిక్ చేయొద్దు.అకౌంట్లు, క్రెడిట్ కార్డు సమస్యలపై బ్యాంకు అధికారులు ఎప్పుడు కాల్స్ చేయరు కాబట్టి వివరాలు చెప్పొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
యూపీఐ చెల్లింపు విధానంలో మోసాలు రోజుకో కొత్త రూపంలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఈ విషయమై ఖాతాదారులకు తగిన అవగాహన కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కొక్క బ్యాంక్ ఈ దిశగా చర్యలకు దిగుతోంది.
యూపీఐ వేదికగా జరుగుతోన్న మోసాలను గురించి ప్రజలను జాగృత పరిచేందుకు తాజాగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారులకు ఈ తరహా మోసాలను వివరిస్తూ ఈమెయిల్స్‌ను పంపుతోంది. స్థిరాస్తి సంస్థలతో పాటు పలు విత్త సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.