కార్వీ చీఫ్‌ రాజీనామా...ఫిన్‌టెక్‌కు త్వరలో కొత్త చైర్మన్?

By Sandra Ashok KumarFirst Published Nov 29, 2019, 12:33 PM IST
Highlights

కార్వీ గ్రూప్ చైర్మన్ సీ పార్థసారథి కార్వీ ఫిన్ టెక్ చైర్మన్ గా వైదొలిగారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ విభాగం చైర్మన్ గా కొనసాగేందుకు అవకాశాల్లేవని నిర్ధారణకు వచ్చాకే ఆయన వైదొలిగినట్లు తెలుస్తున్నది.

కార్వీ ఫిన్‌టెక్‌ నుంచి కార్వీ గ్రూప్‌ సీఎండీ సీ పార్థసారథి తప్పుకున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ (ఆర్‌టీఏ)గా కార్వీ ఫిన్‌టెక్‌ వ్యవహరిస్తోంది. క్లయింట్ల నిధులను కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ దుర్వియోగం చేసిందన్న సెబీ ఆరోపణల నేపథ్యంలో పార్థసారథి రాజీనామా చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్వీ ఫిన్ టెక్ చైర్మన్ పదవిలో కొనసాగడం కష్టమని భావించి ఆయన వైదొలిగినట్లు పార్థసారథి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

also read  ఆ మూడు బీమా సంస్థల విలీనం...15 వేల ఉద్యోగాలకు ఎసరు...

కార్వీ ఫిన్‌టెక్‌లో కార్వీ గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌కు ఉంది. ఈ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు కార్వీ గ్రూప్ సంస్థగా కొనసాగిన కార్వి ఫిన్ టెక్ పేరు మారనున్నది. కార్వీ ఫిన్ టెక్ తాజాగా జనరల్ అట్లాంటిక్ చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. 

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ  పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న నేపథ్యంలో సెబీ ప్రాథమిక ఆంక్షలు విధించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ వాదనలు విన్న తర్వాత సెబీ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కార్వీ ఫిన్ టెక్ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు అనుకూల పరిస్థితి లేదని భావించినందునే పార్థసారధి వైదొలిగారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. త్వరలో కార్వీకి కొత్త బోర్డు చైర్మన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

also read ‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గతవారం ఇచ్చిన ఆదేశాలపై కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్బీఎల్‌) సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)ను ఆశ్రయించింది. సెబీ ఆదేశాలతో ప్రస్తుత క్లయింట్లు తమ షేర్ల విక్రయం, బదలాయింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాట్‌కు కార్వీ వివరించింది. 

దీంతో ఈ అంశాన్ని ప్రాధాన్యత కలిగిన విషయంగా గుర్తించటమే కాకుండా శుక్రవారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు శాట్‌ తెలిపింది. అంతేకాకుండా కార్వీ క్లయింట్లకు ఇబ్బందులకు కలిగించకుండా విచారణ కొనసాగించాలని సెబీకి శాట్‌ న్యాయమూర్తి సూచించారు.

click me!