ఆ మూడు బీమా సంస్థల విలీనం...15 వేల ఉద్యోగాలకు ఎసరు...

By Sandra Ashok KumarFirst Published Nov 29, 2019, 12:06 PM IST
Highlights

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఒక్కొక్కటిగా సంస్కరణల ఎజెండాను బయటకు తీస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకుల విలీనంపై పూర్తి స్థాయిలో కేంద్రీకరించిన కేంద్రం తాజాగా బీమా రంగ విలీనాన్ని ముందుకు తెస్తోంది. మూడు బీమా సంస్థలను విలీనం చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. దీనివల్ల 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

న్యూఢిల్లీ: ఇప్పటికే బ్యాంకుల విలీనం ద్వారా వేల మంది కొలువులకు ఎసరు పెట్టిన కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా దేశంలోని బీమా సంస్థల విలీనానికి తెర తీసింది. కేంద్రం ఇదే విషయమైన పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేసింది. త్వరలోనే నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

ఈ మూడు సంస్థల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమాయేతర ఇన్సూరెన్స్‌ సంస్థ ఏర్పడనుందని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ నేషనలైజేషన్‌ యాక్ట్‌ను సవరించనున్నట్టు తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం చేపట్టిన ఈ విలీనం ప్రక్రియ వల్ల రానున్న రోజుల్లో దాదాపు 10,000-15,000 మంది కొలువులు కొండెక్కనున్నాయని వివిధ విశ్లేషణాత్మక నివేదికల ద్వారా తెలుస్తోంది. 

also read  హైదరాబాద్ నగరంలో మరో ఇంటర్నేషల్ కంపెనీ...: ఐటీ మినిస్టర్ కే‌టి‌ఆర్

గరిష్ట విలువ కలిగిన బీమా సంస్థగా విలీన సంస్థను నిలిపేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ వద్ద తగిన ఉపాయాలు ఉన్నట్టు సర్కార్ వర్గాలు అంటున్నాయి. అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే తాము ఈ మూడు బీమా సంస్థల విలీనం గురించి బడ్జెట్‌ 2018-19లో ప్రకటించినట్లు ఈ వ్యవహారంతో దగ్గరగా సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. 

ఇదే విషయమై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ మాజీ సభ్యులు కె.కె.శ్రీనివాసన్‌ స్పందిస్తూ మూడు సంస్థల విలీనం వల్ల బలమైన బీమా సంస్థ ఏర్పడుతుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ చర్య వల్ల మూడు సంస్థల మధ్య ఉన్న వ్యాపార పోటీ ఆత్మహత్య సదృశ్యంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ రంగంలోనినేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీల విలీనం వల్ల ఏడాదికి రూ.3000 కోట్ల వరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని సర్కార్‌కు అందించిన నివేదికలో అధికారులు తెలిపారు. 

సంస్థ విలీన ప్రతిపాదనలను సమగ్రంగా విశ్లేషిస్తే దీని వల్ల ఆయా సంస్థల్లో అధికంగా ఉన్న దాదాపు రూ.10,000 నుంచి 15,000 మంది కొలువులకు ఎసరొచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం విలీనానికి ప్రతిపాదించిన మూడు సంస్థలు సగటున 800-900ల శాఖలను కలిగి ఉన్నాయి. 

వీటిలో దాదాపు సగటున 15000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంస్థల ఆస్తుల విలువ కూడా దాదాపు రూ.30,000 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు విలీనంతో ఒకేచోట మూడు సంస్థల కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఒకటి నిర్వహణ నిమిత్తం ఉంచి.. మిగతా రెండు సంస్థలకు చెందిన కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొననుంది. 

దీంతో సంస్థలో ఎక్సెస్‌ ఉద్యోగుల బెడద ఏర్పడనుంది. దీంతో వారిని ఇంటికి పంపేందుకు సర్కారు మార్గాలను అన్వేషిస్తోందని  సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ కూడా తన ఆందోళనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

also read సరిలేరు నీకెవ్వరు...రిలయన్స్ అరుదైన ఘనత

మూడు సంస్థలకు కలిపి మొత్తం 90 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. విలీనం తరువాత వీటి సంఖ్య 30కి తగ్గిపోనున్నాయి. దీనికి తోడు విలీన ప్రతిపాదిత సంస్థలు మూడు సంస్థలకు కలిపి ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాఉ 1200 డివిజనల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నిర్వహణక ఏడాదికి సగటున దాదాపు రూ.5 కోట్ల మేర వ్యయం అవుతోంది. 

దీనికి తోడు 3 కంపెనీలు తమ లావాదేవీల నిమిత్తం వేరువేరు ఐటీ ప్లాట్‌ఫాంలపై తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇప్పుడు విలీనంతో లావాదేవీలన్ని ఒకే ప్లాట్‌ఫాంపైకి రానున్నాయి. దీంతో భారీగా ఐటీ విభాగంలో కొలువులను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 

దీనికి తోడు డవలప్‌మెంట్‌ విభాగంలోనూ, అడ్మిన్‌ విభాగాల్లో కొలువులకు కోత పెట్టాల్సిన పరిస్థితి రానుంది. ఇదే జరిగితే దాదాపు 15000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు మున్ముందు బీమాయేతర విభాగంలో కొత్త కొలువులు వచ్చేందుకు దారులూ మూసుకుపోనున్నాయి.

click me!