రిలయన్స్ జియోలో మరో గ్లోబల్ సంస్థ అబుదాబీ సావరిన్ ‘ముబాదాలా’ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం జియోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే జరిగితే రిలయన్స్ సంస్థ రూ.1.53 లక్షల కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న ముకేశ్ అంబానీ ఆకాంక్ష నెరవేరే సమయం దగ్గర పడుతున్నట్లే.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ డిజిటల్ స్ట్రాటర్జీ అద్భుతంగా పని చేస్తోంది. ఆయన సారథ్యంలోని రిలయన్స్ జియో డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ సిద్ధమైనట్లు సమాచారం. అబుదాబికి చెందిన ముబ్దాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీనిపై రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ అంశంపై అటు రిలయన్స్ జియో గానీ, ఇటు అబుదాబీ ముబాదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ స్పందించకపోవడం గమనార్హం. గత వారమే జియోలో అమెరికాకు చెందిన కేకేఆర్ కంపెనీ రూ.11,367 కోట్లు మేర పెట్టుబడి పెట్టింది. అంతకుముందు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
రిలయన్స్ జియో సంస్థలో ఐదు వేర్వేరు సంస్థల మొత్తం పెట్టుబడి విలువ రూ.78,562 కోట్లు. ముబ్దాలా కంపెనీ కూడా జియోలో వాటాలు కొనుగోలు చేస్తే ఆరో కంపెనీ కానున్నది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
also read డొనాల్డ్ ట్రంప్ ట్విట్లపై స్పందించిన ట్విట్టర్ సిఈఓ...
విశ్వసనీయ సమాచారం ప్రకారం రిలయన్స్ జియోలో అబుదాబీ సంస్థ 100 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది రిలయన్స్ జియోలో ఒక శాతం ఈక్విటీతో సమానమని తెలుస్తోంది. అసలు విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ సంస్థలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న సమయంలోనే అబుదాబీ సావరిన్ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం రిలయన్స్ జియో సంస్థలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మరో వార్త వచ్చింది. ఇటు అబుదాబీ సావరిన్ సంస్థ, అటు మైక్రోసాఫ్ట్ సంస్థలతోనూ జియో ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
మైక్రోసాఫ్ట్, అబుదాబీ సావరిన్ సంస్థల్లో పెట్టుబడుల అంశం వాస్తవ రూపం దాటితే రూ.1.53 లక్షల కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న ముకేశ్ అంబానీ లక్ష్యానికి చేరువ అవుతున్నట్లే కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌లో టెలికం ఇన్షియేటివ్స్, జియో డిజిటల్ సర్వీసెస్ (మొబైల్, బ్రాడ్ బాండ్), యాప్స్, టెక్నాలజీ క్యాపబిలిటీస్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) తదితర విభాగాలు ఉన్నాయి. వీటితోపాటు డెన్ నెట్వర్క్, హాత్ వే కేబుల్, డేటా కామ్ సంస్థలు రిలయన్స్ పరిధిలోకే వస్తాయి.