జెట్‌ ఎయిర్వేస్‌కు 10 మిలియన్ల డాలర్ల లోన్?! బ్యాంకర్లూ రెడీ?!

By Siva KodatiFirst Published Jul 21, 2019, 1:31 PM IST
Highlights

జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని రిజొల్యూషన్ ప్రొఫెషనల్స్ (ఆర్పీ) బిడ్లను ఆహ్వానించింది. వచ్చేనెల మూడో తేదీలోగా ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

రుణ సంక్షోభంతో నేలకొరిగిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊరట కలిగించేలా శనివారం పలు అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు సాయం చేయడానికి రుణదాతలు, బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

జెట్ ఎయిర్వేస్ సంస్థకు ఎంత మొత్తంలో రుణం ఇవ్వనున్నారో మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కానీ 10 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు వివిధ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. ఉద్యోగులకు సైతం వేతనాలు చెల్లించుకోలేని పరిస్థితికి జెట్‌ ఎయిర్‌వేస్ చేరుకున్నది. 

ఈ రుణంతో జెట్ ఎయిర్వేస్ కొంత మేర బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరం. జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా కేసు పరిష్కారానికి నియమించిన రిజల్యూష్‌ ప్రొఫెషనల్‌ (ఆర్పీ) శనివారం కీలక ప్రకటన చేశారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ను విక్రయించేందుకు ఆర్పీ ఔత్సాహిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది ఆర్పీ. ఈవోఐ దరఖాస్తుకు వచ్చే నెల 3వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించినట్టు ఆర్పీ ఆశీశ్‌ చ్వచారియా తెలిపారు. ఆగస్టు 6న ఈవోఐ దాఖలు చేసిన సంస్థ వివరాలతో ప్రాథమిక జాబితాను విడుదల చేయనున్నట్లు ఆర్పీ తెలిపింది. 

ఈ బిడ్లపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత రిజొల్యూషన్ అప్లికెంట్ల తుది జాబితాను వచ్చే నెల 14వ తేదీన ప్రచురిస్తారు.  బిడ్లు దాఖలు చేసిన సంస్థలు సెప్టెంబర్ ఐదో తేదీనాటికి తమ రిజొల్యూషన్ ప్లాన్లు తప్పక ఎన్సీఎల్టీకి సమర్పించాల్సి ఉంటుంది.

జెట్ ఎయిర్వేస్‌ను ఆదుకునే సంస్థ పేరును రిజొల్యూషన్ ప్రొఫెషనల్స్ (ఆర్పీ) ఖరారు చేసిన తుది నివేదికను ఎన్సీఎల్టీకి తెలియజేయాల్సి ఉంటుంది. 

click me!