భారతీయ ఐటీ దిగ్గజాలను పక్కనపడేసి... అమెజాన్‌కు హెచ్-1బీ వీసాలు

By Siva KodatiFirst Published Mar 9, 2019, 10:47 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలులోకి తెచ్చిన హెచ్ 1 బీ వీసా నిబందనలు 2018లో బాగానే అమల్లోకి వచ్చాయి. అమెరికా సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యం భారత్ తదితర దేశాల ఐటీ సంస్థలకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవ్వనే లేదు

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు తప్పనిసరైన హెచ్ 1బీ వీసాలను సాధ్యమైనంత వరకూ తగ్గించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని కోసం కఠిన నిబంధనలను కూడా అమలులోకి తెచ్చింది. 

ఈ నిబందనల ప్రకారం 2018లో హెచ్ -1 బీ వీసాల కోసం భారత ఐటీ సంస్థలు చేసుకున్న దరఖాస్తులు భారీగానే తిరస్కరణకు గురయ్యాయి. వాటిల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్ సంస్థల అప్లికేషన్లను తోసిపుచ్చింది అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ విభాగం. 

అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొన్న వివరాల మేరకు హెచ్ 1బీ వీసా కోసం అత్యధికంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి భారతీయ కంపెనీలే దరఖాస్తు చేశాయి. వీటిలో ముఖ్యంగా కాగ్నిజెంట్ సంస్థ చేసిన దరఖాస్తుల్లో అత్యధికంగా 3,548 దరఖాస్తులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది. 

గతేడాది తిరస్కరణకు గురైన ఓ సంస్థ దరఖాస్తుల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలవే అత్యధికం. అలాగే బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్ దరఖాస్తుల్లో 2,042 తిరస్కరించగా, టీసీఎస్ 1,744 తిరస్కరణలతో మూడో స్థానంలో నిలిచింది. 

హెచ్ 1 బీ వీసాల దరఖాస్తులు తిరస్కరించబడిన సంస్థల జాబితాలోని 30 అంతర్జాతీయ కంపెనీల్లో ఆరు భారతీయ కంపెనీలే ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ సంస్థలతోపాటు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ సంస్థల అమెరికా విభాగాలు సమర్పించిన దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

ఆరు భారత కంపెనీలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌లతోపాటు టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్నాలజీ అమెరికా శాఖలు చేసిన దరఖాస్తుల్లో కేవలం 16శాతం, మొత్తమ్మీద 2,145 మాత్రమే ఆమోదం పొందాయి.

ఈ సంఖ్య అదే ఏడాది అమెజాన్ సంస్థ పొందిన హెచ్ 1బీ వీసాల కన్నా తక్కువ. కేవలం అమెజాన్ సంస్థ అత్యధికంగా 2,399 హెచ్ 1 బీ వీసా దరఖాస్తులకు ఆమోదం లభించింది మరి. 

అంటే ఆరు భారతీయ కంపెనీలు ఒక్క అమెజాన్ సంస్థకు వచ్చినన్ని వీసాలు కూడా సంపాదించలేకపోయాయి. ఈ తిరస్కరణలపై స్పందించడానికి ఆయా సంస్థలు నిరాకరించాయి. అయితే ఈ పరిణామాలు ఐటీ రంగంలో అభివృద్ధిని అడ్డుకుంటాయని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు.

టాప్ -30 ఐటీ సంస్థలు సమర్పించిన హెచ్1 బీ వీసా దరఖాస్తుల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థలవి 7,933 అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇతర భారత ఐటీ సంస్థలతోపాటు మొత్తం 13,177 హెచ్ -1 బీ వీసా అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 

మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ సంస్థల హెచ్-1బీ వీసా దరఖాస్తులు మాత్రమే పెరిగాయి. తమ దేశీయ సంస్థలకే పెద్దపీట వేసింది ట్రంప్ సర్కార్. తద్బిన్నంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలకు ఇచ్చిన హెచ్ 1 బీ వీసాలు తగ్గుముఖం పట్టాయి. 
 

click me!