ఫ్రెషర్స్‌‌కి గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు

By Galam Venkata Rao  |  First Published Jul 18, 2024, 9:51 PM IST

టెక్, ఇతర వ్యాపార సంస్థలు లేఆఫ్‌ల దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఇన్‌ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది భారీగా ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు ప్రకటించింది.


టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. అనేక సంస్థలు లేఆఫ్‌ల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 15వేల -20వేల ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 11వేల 900 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. అయితే, ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో నియమించుకున్న 50వేల మంది ఫ్రెషర్ల కంటే 76 శాతం తక్కువ. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ముఖ్య ఆర్థిక అధికారి (CFO) జయేష్ సంఘ్‌రాజ్కా కీలక ప్రకట చేశారు. 2024 జూలై 18న జరిగిన కంపెనీ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సమావేశంలో జయేష్ సంఘ్‌రాజ్కా మాట్లాడుతూ, ‘‘మేము ఈ సంవత్సరం 15,000-20,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 

ఇన్ఫోసిస్‌ దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ. కాగా, గత ఏడాది ఐటీ ఉద్యోగాల కొరత అనంతరం ఇన్ఫోసిస్ చేసిన ఈ ప్రకటన రాబోయే కాలేజీ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం. ‘‘గత కొన్ని త్రైమాసికాలుగా మేం చురుగ్గా నియామకాలు చేపడుతున్నాం. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానాల్లో ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటున్నాం. ఈ త్రైమాసికంలో మా వద్ద 2వేల మంది ఉద్యోగుల నికర తగ్గుదల జరిగింది. ఇది గత త్రైమాసికాల కంటే తక్కువ. ఇప్పటికే మా యుటిలైజేషన్ 85 శాతం ఉన్నందున ఖాళీ తక్కువగానే ఉంది. వృద్ధిని బట్టి నియామకాలు చేపడతాం. ఇందులో భాగంగానే 15వేల నుంచి 20వేల మందికి రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నాం’’ అని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు. అయితే, Q1లో రిక్రూట్ అయిన ఫ్రెషర్‌ల సంఖ్యను ఆయన వెల్లడించలేదు. 

Latest Videos

ఇదిలా ఉండగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకోనుంది. ఇప్పటికే Q1లో దాదాపు 11 వేల మంది ట్రైనీలను చేర్చుకుంది.

click me!