కోవిడ్ సంక్షోభం: సెలవులతో కాస్ట్ కటింగ్‌.. వ్యూహాత్మకంగా ఇండిగో అడుగులు

By Siva KodatiFirst Published Jun 1, 2021, 2:58 PM IST
Highlights

దేశీయ విమాన‌యాన సంస్థ ఇండిగో త‌మ‌ సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌ సీనియర్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది

దేశీయ విమాన‌యాన సంస్థ ఇండిగో త‌మ‌ సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌ సీనియర్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. లీవ్ వితౌట్ పే (ఎల్‌డ‌బ్ల్యూపీ) పేరిట తీసుకొచ్చిన ఈ ప‌థ‌కం ప్ర‌కారం సీనియర్ ఉద్యోగులు త‌ప్ప‌కుండా నెల‌కు నాలుగు సెల‌వులు (ఎలాంటి చెల్లింపులు లేని) తీసుకోవాలి.

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ప్ర‌యాణికుల సంఖ్య గ‌ణనీయంగా త‌గ్గి, ఆదాయం భారీగా ప‌డిపోయిన‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇండిగో సంస్థ వెల్ల‌డించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో అన్ని రంగాలు న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నాయని.. విమాన‌ ప్రయాణికులు త‌గ్గారని.. ఫలితంగా తమ వాణిజ్య షెడ్యూల్‌ను సైతం మార్చాల్సి వచ్చిందని ఇండిగో ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆషిమ్ మిత్రా అన్నారు. అందుకే ఎల్‌డ‌బ్ల్యూపీ స్కీంను తీసుకొచ్చామ‌ని ఆయన తెలిపారు. 

Also Read:విమాన ప్రయాణికులకు శుభవార్త: రద్దు చేసిన విమానా టికెట్ ఛార్జీలు జనవరి చివరిలోగా చెల్లింపు..

దీని ప్ర‌కారం ఉద్యోగి గ్రూపు ఆధారంగా 1.5 నుంచి 4 రోజుల వ‌ర‌కు ఎలాంటి చెల్లింపులు లేని సెల‌వులు తీసుకోవాల్సిందేన‌ని ఆషిమ్ పేర్కొన్నారు. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దీన్ని అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. అలాగే ఈ స్కీం కింద‌ సంస్థ‌లోని ప్ర‌తి పైల‌ట్ వ‌చ్చే మూడు నెల‌లు త‌ప్ప‌కుండా నెల‌కు 3 రోజుల పాటు సెల‌వులు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. కాగా ఫిబ్ర‌వ‌రి 28న ఇండిగో విమానాల్లో దేశీయంగా 3 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ప్ర‌యాణించ‌గా, ఆ మరుసటి నెలకి అంటే మార్చి 30నాటికి ఈ సంఖ్య 70వేల‌కు ప‌డిపోయిన‌ట్లు ఆషిమ్ వెల్లడించారు. దీంతో సంస్థ‌ ఆదాయానికి భారీగా గండి ప‌డింద‌ని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆర్థిక భారం త‌గ్గించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆషిమ్ తెలిపారు.  

click me!