Digital Currency: 2023లో కొత్త డిజిటల్ కరెన్సీ.. కేంద్రానికి ఖర్చు ఆదా..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 04:07 PM IST
Digital Currency: 2023లో కొత్త డిజిటల్ కరెన్సీ.. కేంద్రానికి ఖర్చు ఆదా..!

సారాంశం

భారత్ తన సొంత క్రిప్టో కరెన్సీని 2023 ఏడాది ప్రారంభంలో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ క్రిప్టో కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యాలెట్ తరహాలో ఇది కూడా పని చేస్తుంది.

భారత్ తన సొంత క్రిప్టో కరెన్సీని 2023 ఏడాది ప్రారంభంలో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ క్రిప్టో కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యాలెట్ తరహాలో ఇది కూడా పని చేస్తుంది. కానీ దీనికి ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశాయి. రిజర్వ్ బ్యాంక్ మద్దతుతో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు.

పేపర్ కరెన్సీ తరహాలోనే డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చలామణిలోని నగదుతో పోలిస్తే డిజిటల్ కరెన్సీ భిన్నంగా ఏమీ ఉండదని, డిజిటల్ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్ రూపంగా భావించవచ్చునని చెబుతున్నాయి. ఓ రకంగా డిజిటల్ కరెన్సీ ప్రభుత్వ భరోసా ఉన్న ఒక ఎలక్ట్రానిక్ వ్యాలెట్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి డిజిటల్ కరెన్సీ వినియోగానికి సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఆర్బీఐ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చేతి నోట్లకు బదులు ఫోన్‌లో డిజిటల్ కరెన్సీ ఉంటుంది. దానిని ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కోసమైనా వినియోగించవచ్చు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. పర్సుకు బదులు వ్యాలెట్‌లో డబ్బులు ఉంటాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా ఖర్చు ఆదా కానుంది.

నిర్వహణ ఖర్చులు, ప్రింటింగ్, పంపిణీ, నిల్వ రూపంలో ఖర్చులు తగ్గనున్నాయి. వ్యవస్థలో చలామణిలో ఉన్న భౌతిక కరెన్సీలో కొంత భాగం మేర డిజిటల్ రూపీలోకి మారిపోనుంది. అంటే ఆ మేరకు భౌతిక కరెన్సీ తగ్గిపోనుంది. భౌతిక కరెన్సీ తగ్గిందంటే ఆ మేరకు ఆర్బీఐకి ఖర్చులు ఆదా అయినట్టే. ప్రతి రూ.100 నోటు తయారీకి రూ.15-17 ఖర్చవుతోంది. దీని కాల వ్యవధి నాలుగేళ్లు. అంటే పాతబడిన నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. ఇది ఎప్పుడూ నడిచే ప్రక్రియ. కనుక ఈ విధానంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సీబీడీసీతో కరెన్సీ నిర్వహణ ఖర్చు తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి రామ్ రస్తోగి తెలిపారు. డిజిటల్ రూపీని వ్యక్తులు తమ మధ్య లావాదేవీలకు ఫియట్ కరెన్సీగా వినియోగించుకోవచ్చు. 2021 మార్చి నాటికి వ్యవస్థలో రూ.28.32 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది.

PREV
click me!

Recommended Stories

Gold Price Fall: అంతర్జాతీయ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. కుప్పకూలిన బంగారం ధరలు
India's First Hydrogen Train: డీజిల్, కరెంట్ లేకుండా నీటి ఆవిరితో నడిచే సరికొత్త ట్రైన్ ఇది !