అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో దెబ్బతిన్న భారతీయ స్టాక్ మార్కెట్స్ మూడు రోజుల వరుస సెలవుల తర్వాత మళ్లీ జోరందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ టాప్‌లో ఉంది.
Stock Market: వరుస సెలవుల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్స్ లో నయా జోష్ కనిపిస్తోంది. ఏప్రిల్ 15న స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల ఏప్రిల్ 2న కలిగిన నష్టాన్ని కూడా మార్కెట్ భర్తీ చేసింది. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో ఎన్ఎస్ఈ-నిఫ్టీ ఇండెక్స్ 2.4% వరకు పెరిగి, ఏప్రిల్ 2 ముగింపు స్థాయికి దగ్గరగా వచ్చింది. అంటే ట్రంప్ టారిఫ్ దెబ్బనుండి ఇండియన్ స్టాక్ మార్కెట్ కేవలం 7 ట్రేడింగ్ సెషన్లలోనే కోలుకుంది.
ఏప్రిల్ 2న డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బనుంచి కోలుకున్న మొదటి ప్రధాన మార్కెట్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఆసియా మార్కెట్ల మొత్తం పనితీరును చూస్తే, ఇండియన్ మార్కెట్ చార్టులో టాప్‌లో ఉంది. ట్రంప్ టారిఫ్ వల్ల ఏర్పడిన అస్థిరత నడుమ, ఇన్వెస్టర్లు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ను ఇతర మార్కెట్ల కంటే చాలా సురక్షితంగా చూస్తున్నారు. దేశంలోని పెద్ద దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇతర పోటీదారులతో పోలిస్తే ప్రపంచ మాంద్యాన్ని బాగా ఎదుర్కోగలదని భావిస్తున్నారు.
ద గ్లోబల్ సిఐఓ ఆఫీస్ సీఈవో గ్యారీ డుగన్ ప్రకారం... మా పోర్ట్‌ఫోలియోలో భారతదేశంపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నామన్నారు. మంచి దేశీయ వృద్ధి మరియు చైనా నుండి సరఫరా వ్యవస్థ వైవిధ్యీకరణ కారణంగా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ను మధ్యస్థ కాలంలో సురక్షితంగా చూస్తున్నామని ఆయన అన్నారు. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం వేడెక్కడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారతదేశంపై దృష్టి సారించబడిందన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా ప్రతీకార చర్యలకు భిన్నంగా, భారతదేశం రాజీ వైఖరిని అవలంబించిందని... దీంతో భారతదేశం ట్రంప్ పరిపాలనతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి దగ్గరవుతోందన్నారు.
ఏప్రిల్ 15న సెన్సెక్స్-నిఫ్టీ 2.10 శాతం కంటే ఎక్కువ పెరిగి ముగిశాయి. సెన్సెక్స్ 1577 పాయింట్లు పెరిగి 76,734 వద్ద ముగిసింది, నిఫ్టీ కూడా 500 పాయింట్లు పెరిగి 23,328 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్లు పెరిగి 52379 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు 3% పెరిగి 51,974 వద్ద ముగిసింది.
ఇలా స్టాక్ మార్కెట్ జోరందుకోవడంతో గతకొద్దిరోజులు నష్టాలబాటలో నడిచిన మార్కెట్ భారీ లాభాలను చవిచూసింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లు ఏకంగా రూ.,10 లక్షల కోట్లు లాభపడ్డారు. బిఎస్ఈ లో నమోదైన కంపనీల మొత్తం విలువ రూ.402 లక్షల కోట్ల నుండి రూ.412 కోట్లకు చేరింది.