ద్రవ్యలోటుకు కళ్లెం వేయాలంటే ఐఓసీకి మంగళం

By Sandra Ashok KumarFirst Published Nov 15, 2019, 12:39 PM IST
Highlights

ఆర్థిక మాంద్యం సంకేతాలు.. ప్రజల్లో తగ్గిన గిరాకీ.. రెవెన్యూ వసూళ్లు లక్ష్యాలను చేరుకోని వైనం.. దరిమిలా ద్రవ్యలోటు దూసుకు వస్తున్నది. దీని నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నది. ప్రత్యేకించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)లో వాటాల ఉపసంహరణకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంకా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాల్లోనూ వాటాలను ఉపసంహరించుకునేందుకు వచ్చే బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మోదీ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. 

న్యూఢిల్లీ: దేశంలో పన్ను ఆదాయం పడిపోతూ.. సర్కార్ ద్రవ్యలోటు అంతకంతకు పెరిగిపోతున్నది ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఆపసోపాలు పడుతోంది. పెరుగుతున్న ద్రవ్యలోటును నియంత్రణకు పాడి ఆవుల్లాంటి ప్రభుత్వ సంస్థల్లో తనకున్న కీలక వాటాను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని భావిస్తోంది. 

దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్‌ సంస్థ అయిన ''ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌''లో (ఐఓసీ) కీలక వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐఓసీలో ప్రస్తుతం భారత ప్రభుత్వం నేరుగా 51.5 శాతం నియంత్రిత వాటాను కలిగి ఉంది.

మరో 25.9% వాటా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ చేతుల్లోనూ.. మిగతా వాటా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, ఆయిల్‌ ఇండియా సంస్థల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో తన వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

also read ఎస్‌బి‌ఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ తన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ యూనిట్‌తో కలిసి దేశ వ్యాప్తంగా 11 రిఫైనరీలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశంలోని మొత్తం ముడిచమురు శుద్ధికరణ సామర్థ్యంలో దాదాపు 35 శాతం వాటా కలిగి ఉంది.

రిఫైనరీతో పాటు దేశంలోని మొత్తం రిఫిల్లింగ్‌ స్టేషన్లలో దాదాపు సగం బంకులు ఐఓసీ గొడుగు కిందే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థలను అమ్మితే మార్కెట్ల నుంచి అంతగా స్పందన రాదని భావిస్తున్న మోదీ సర్కార్.. పాడి ఆవులాంటి ఐఓసీలో వాటాను విక్రయానికి ఉంచితే మంచి స్పందన లభించి అనుకున్న సొమ్ము చేతుకొస్తుందని భావిస్తున్నట్టుగా సమాచారం. 

ఐఓసీలో వాటా విక్రయ ప్రతిపాదనలు ఇప్పటికే తయారైనట్టుగా సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఐఓసీలో కీలక వాటా విక్రయంపై మోదీ సర్కార్ సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల అంచనా ప్రకారం ఐవోసీలో సర్కారు దాదాపు 26.4 శాతం వాటాను విక్రయించనున్నట్లు సమాచారం.

ఐఓసీలో తన వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.33,000 కోట్ల మేర నిధులను సమీకరించొచ్చని మోదీ సర్కార్ ఆలోచనగా ఉంది. ఐఓసీలో కీలక వాటాను ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ మార్గంలో జనవరిలోగా విక్రయించాలన్నది సర్కార్ ప్రణాళిక అని సమాచారం. ఈ వాటా విక్రయించినా సంస్థలో కీలక వాటా వివిధ రూపాల్లో సర్కారు చేతుల్లోనే ఉండనున్నదని ఆధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తూ ఐఓసీలో వాటాను విక్రయించాలని సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, రిటైలింగ్‌ సంస్థ ఐఓసీలో వాటా విక్రయం వల్ల మున్ముందు దేశ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోదీ సర్కార్ తన పరువు నిలుపుకొనేందుకే మేటి సంస్థల్లో వాటా విక్రయం వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్‌లో సర్కార్ ద్రవ్యలోటు గరిష్ట అవధిని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించుకుంది. సర్కార్ తన ఖర్చును తగ్గించుకొనే దిశగా చర్యలు తీసుకోకపోవడం, మందగమనం వల్ల ద్రవ్యలోటు దాదాపు అంచనా వేసిన స్థాయికి చేరువైంది.

also read నకిలీ బ్రాండ్లకు అమెజాన్ షాకింగ్ న్యూస్

ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఐదు నెలల కాలం మిగిలి ఉన్నా లోటు మరింతగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సర్కారు తన వ్యయాలకు అవసరమైన నిధుల కోసం ద్రవ్యలోటను తగ్గించుకొనేందుకు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థల్లో డిజిన్వెష్ట్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ.1.05 లక్షల కోట్ల మేర నిధులను సమీకరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ లక్ష్యాన్ని అందుకొనేందుకు లాభాల్లో ఉన్న ఆకర్షణీయమైన ప్రభుత్వ కంపెనీల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. 

ఇందుకు మోదీ సర్కార్ ఇండియన్‌ ఆయిల్‌తో పాటు ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, గెయిల్‌ ఇండియా వంటి సంస్థలను ఎంపిక చేసి పెట్టుకుంది. వాటా విక్రయ ప్రక్రియలో భాగంగానే భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల్లో వాటా విక్రయం పైనా కూడా వచ్చే వారం జరగనున్న క్యాబినెట్‌ సమావేశంలో సర్కార్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

click me!