
భారతదేశంరానున్న సంవత్సరాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసే దేశంగా అవతరించనుందని అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకులు రే డాలియో అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023లో ప్రసంగించడానికి ఆహ్వానించబడిన డాలియో.. ‘‘గవర్నమెంట్స్ అండ్ ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్’’ అనే సెషన్‌లో భారతదేశానికి ఉన్నత ర్యాంక్ ఇచ్చారు. యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావితో జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడారు.
‘‘భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. గత 10 సంవత్సరాల అధ్యయనం, దేశం కోసం మనం చూస్తున్న దాని ఆధారంగా భారతదేశం అతిపెద్ద, వేగవంతమైన వృద్ధి రేటును కలిగి ఉంటుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలలో ఈ దేశం అతిపెద్ద పరివర్తనను చూస్తుంది’’ అని డాలియో పేర్కొన్నారు.
యూఎస్, చైనా అధికార వైరుధ్యాలు కలిగి ఉన్నాయని.. అయితే భారత్ వంటి ‘‘తటస్థ దేశాలు’’ అభివృద్ధి చెందుతాయని డాలియో తెలిపారు. యుద్ధాలకు దూరంగా ఉన్న దేశాలు ప్రయోజనం పొందుతాయని అన్నారు. ‘‘భారతదేశం డైనమిక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో కొన్ని కుటుంబాల ఆధిపత్యం ఉంది. అది ఓపెన్‌గా లేదు.. ప్రవేశించడానికి సులభమైన ప్రదేశం కాదు. కానీ బాగా పని చేస్తుంది’’ అని డాలియో అన్నారు.