కరోనా ధాటికి కుప్పకూలిన భారతీయ విమానయాన రంగం.. మళ్లీ రెక్కలు తొడుగుతోంది. గత మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే
హైదరాబాద్: కరోనా ధాటికి కుప్పకూలిన భారతీయ విమానయాన రంగం.. మళ్లీ రెక్కలు తొడుగుతోంది. గత మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ సర్వీసుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రాల్లో విమాన రాకపోకలు మాత్రం ఇంకా ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. వరదల కారణంగా బెంగాల్ రాష్ట్రంలో, కరోనాతో మహారాష్ట్ర.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు, మార్గదర్శకాల మధ్య ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ప్రయాణికుల నుంచి ప్రయాణికులకు, సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఏఏఐ వెల్లడించింది. ప్రయాణికులు తప్పక నిబంధనలు పాటించాలని, అప్పుడే విమానం ఎక్కేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
నిబంధనల ప్రకారం, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని, తప్పనిసరి ఫేస్ మాస్కులు ధరించాలని ఏఏఐ సూచించింది. ప్రయాణికులు 20 కిలోల లగేజీని మాత్రమే వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది.
విమానాశ్రయ ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేనివారినే లోపలికి అనుమతిస్తామని తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య పరిస్థితిపై ప్రతి ప్రయాణికుడు స్వీయ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రతి ప్రయాణికుడి సెల్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ఏఏఐ నిర్ణయం తీసుకున్నది. విమానాశ్రయంలో భౌతిక దూరాన్ని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని స్పష్టం చేసింది
ఇక ప్రయాణికులకు ప్రతి చోట శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతోపాటు విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికుల లగేజీని పూర్తిస్థాయిలో శానిటైజింగ్ చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం బోర్డింగ్ పాస్ కియోస్క్‌ల సంఖ్య పెంచనున్నారు.
విమానాశ్రయ సిబ్బందితోపాటు ఎయిర్ హోస్టెస్‌లు పీపీఈ కిట్లు ధరించి సేవలందించేలా చర్యలు తీసుకున్నట్టు ఏఏఐ స్పష్టం చేసింది. ప్రస్తుత కష్టకాలంలో తమ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వహించనున్నారని సీఐఎస్‌ఎఫ్ ఎయిర్‌పోర్టు సెక్టార్-2 ఐజీ సీవీ ఆనంద్ తెలిపారు.
ప్రయాణికులకు, సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ప్రయాణికులు తమ సిబ్బందికి సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
దేశీయ విమాన సర్వీసుల్లో భాగంగా హైదరాబాద్-శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన సేవల పునరుద్ధరణకు సిద్ధమైంది. కరోనా సమయంలో దేశీయ సర్వీసులు ప్రారంభిస్తున్నందున ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు జీఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు.
దేశీయ ప్రయాణాలకు పౌర విమానయాన శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తామని అన్నారు. మొదటి విడుతలో 30 శాతం, రెండో విడుతలో మరో 30 శాతం ఆపరేషన్స్ ప్రారంభించి అతి త్వరలో మొత్తం కార్యకలపాలను నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ నుండి దేశంలోని 36 ప్రాంతాలకు సర్వీసులు నడిపిస్తామన్నారు.
also read:కరోనా కట్టడిపైనే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్.. తేల్చేసిన ‘నిర్మల’మ్మ
విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్కానింగ్, ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లు, భౌతిక దూరం పాటించే గుర్తులు, దూరంగా కూర్చునేందుకు ఏర్పాట్లు, ఒకరికి మరొకరు తాకకుండా ఎంట్రీగేట్లు, చెకిన్ ఐలాండ్స్ ఏర్పాటు చేసినట్టు ఎస్జీకే కిశోర్ తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారం తినడాన్ని అనుమతించబోవట్లేదని, సీట్ల మధ్య దూరం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అయితే ప్రత్యేక యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే విమానాశ్రయంలో ఆహారం సిద్ధంగా ఉంచుతామన్నారు. కాగా, వందే భారత్ విమానాల ద్వారా 3 వేల మంది ప్రయాణికులను ఇతర దేశాల నుండి తీసుకువచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయ సిబ్బంది ఎవరూ కరోనా బారిన పడలేదని ఎస్జీకే కిశోర్ ప్రకటించారు.