పన్ను శ్లాబ్‌ల్లో క్లారిటీ కోసం ఐటీ వెబ్‌సైట్‌లో ఈ-కాలిక్యులేటర్‌

By Sandra Ashok KumarFirst Published Feb 7, 2020, 10:00 AM IST
Highlights

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయం పన్ను శాఖ వెబ్ సైట్ లో ’ఈ-క్యాలికులేటర్’ను ప్రారంభించింది. ఇది కొత్త, పాత ఆదాయం పన్ను విధానాల్లో తేడా తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చి ప్రజలకు పన్ను శ్లాబులపై సందేహాలకు సమాధానాలు తెలుపుతుంది. మరోవైపు సత్వరం పాన్ కార్డు జారీకి కేంద్రం చర్యలు చేపట్టింది. ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఆధార్‌తోపాటు వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే ముందు ఓటీపీ తర్వాత ఈ-పాన్ కార్డు జారీ అవుతుంది. ఈ ఈ-పాన్ కార్డు ఐటీ రిటర్న్స్‌లో మీకు ఉపకరిస్తుంది.
 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ మరో మూడు కొత్త శ్లాబ్‌లతో నూతన ఐటీ రిటర్న్స్ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపు కోసం పాత శ్లాబ్ విధానం ఎంచుకోవాలా? కొత్త శ్లాబ్‌ల విధానం ఎంచుకోవాలా? ఏ విధానం ఎంచుకుంటే పన్ను పోటు తగ్గుతుంది? ఈ ప్రశ్న ప్రస్తుతం లక్షల మంది ఐటీ చెల్లింపుదారుల్ని వేదిస్తున్నది. 

ఐటీ వెబ్ సైట్ ఇలా ఈ క్యాలికులేటర్
ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ‘ఈ-కాలిక్యులేటర్‌’ ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వయస్స, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్‌ చేసి క్లిక్‌ చేయాలి. 

also read బడ్జెట్​లో సంస్కరణలపై కేంద్రం లైట్ తీసుకుంది: ఫిచ్‌

పన్ను భారం ఎంతో ఇలా ప్రత్యక్షం
అప్పుడు వారి పన్ను చెల్లింపు ఆదాయంపై పాత విధానం ప్రకారం ఎంత పన్ను భారం పడుతుంది? కొత్త విధానం ఎంచుకుంటే ఎంత పన్ను పోటు పడుతుందనే విషయం కంప్యూటర్‌ మానిటర్‌పై ప్రత్యక్షం అవుతుంది. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త శ్లాబుల ఐటీ విధానం 2020-21 ఆర్థిక సంవత్సరం అమల్లోకి రానుంది. 

పాత పన్ను విధానంలో ఇలా రాయితీలు
ఐదు, పది, 30 శాతం శ్లాబులు ఉండే పాత విధానం ఎంచుకుంటే రూ.50వేల ప్రామాణిక తగ్గింపుతోపాటు సెక్షన్‌ 80సీ కింద వివిధ పెట్టుబడుల్లో పెట్టే రూ.1.5 లక్షల పెట్టుబడులకు మినహాయింపు లభిస్తుంది. కొత్త విధానం ఎంచుకుంటే మాత్రం ఈ ప్రయోజనాలేవీ లభించవు.

నెలాఖరు నుంచి నిమిషాల్లోనే పాన్‌కార్డ్‌
దేశంలో పన్ను ఆదాయం పెంపుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇందుకోసం ప్రజల నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం సమీకరించాలని చూస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా సత్వరం 'ఈ పాన్‌ కార్డు' పొందే విధానాన్ని ఈ నెల నుంచి అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అమలు గురించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్‌ పాండే గురువారం వెల్లడించారు. 

ఆధార్ వివరాలు సమర్పించగానే సత్వరం పాన్ కార్డు జారీ
ఆధార్‌ వివరాలు సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో సత్వరం పాన్‌కార్డు పొందేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అనుగుణంగానే ఈ నెలాఖరు నుంచే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్టుగా ఆయన వివరించారు.

వెబ్ సైట్లోకి వెళ్లి ఆధార్ వివరాలు నమోదు చేస్తే సరి
'ఎవరైనా ఈ-పాన్‌ కావాలనుకుంటే సొంతంగా ఆదాయ పన్ను(ఐటీ) విభాగం వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌నంబర్‌ నమోదు చేయాలి. దీంతో ఆధార్‌తో అనుసంధానం అయిన రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా వివరాలు పరిశీలన పూర్తి కాగానే పాన్‌ నంబర్‌ కేటాయించబడుతుంది. అనంతరం ఆన్‌లైన్‌ ఈ-పాన్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు' అని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్‌ పాండే తెలిపారు.

also read రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

ఈ- పాన్ కార్డుతో ప్రయోజనాలివి..
పన్ను చెల్లింపుదారులు ఐటీ శాఖకు దరఖాస్తు ఫారమ్‌ సమర్పించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పాన్‌కార్డుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటి నుంచి మొత్తం 30.75కోట్ల మంది అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. 2020, జనవరి 27 వరకు ఇంకా 17.58కోట్ల మంది పాన్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. 

పాన్ కార్డు జారీకి మార్చి 31 తుది గడువు
ఇందుకోసం చివరి తేదీ ఈ ఏడాది మార్చి 31వ తేదీని తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ విధానం వల్ల ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుందని సర్కార్ వర్గాలు చెబుతున్నాయి.

click me!