బడ్జెట్​లో సంస్కరణలపై కేంద్రం లైట్ తీసుకుంది: ఫిచ్‌

By Sandra Ashok Kumar  |  First Published Feb 6, 2020, 1:13 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో నూతన నిర్మాణాత్మక సంస్కరణలను తేలికగా తీసుకుందని ఆర్థికసేవల సంస్థ ఫిచ్ తెలిపింది. దేశ వృద్ధిరేటును 5.6 శాతానికి పెంచేందుకు అవసరమైన మార్పులేవీ బడ్జెట్​లో లేవని స్పష్టం చేసింది.


న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో నూతన నిర్మాణాత్మక సంస్థాగత సంస్కరణలను తేలికగా తీసుకుందని ఆర్థిక సేవల సంస్థ 'ఫిచ్‌' పేర్కొన్నది. మందగమనం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వృద్ధి రేటును 5.6 శాతానికి పెంచేందుకు అవసరమైన మార్పులు బడ్జెట్‌లో లేవని పేర్కొంది.

2025- 26 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వ అప్పులు జీడీపీలో 60 శాతానికే పరిమితం కావడానికి అవకాశాలు చాలా తక్కువ అని ఫిచ్‌ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అప్పులు 70 శాతానికి దగ్గరగా ఉండవచ్చని తెలిపింది.కార్పొరేట్‌ ఆదాయం పన్నులో తగ్గింపు వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచినా, ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఫిచ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Latest Videos

also read  లింక్డ్ఇన్ సి‌ఈ‌ఓ జెఫ్ వీనర్ రాజీనామా...

బ్యాంకింగేతర రుణ సంస్థల ఇబ్బందులు తీర్చేందుకు బడ్జెట్‌లో కొన్ని చర్యలు ప్రకటించినా అవి పాక్షికంగానే ఉన్నాయని తెలిపింది. గృహ రుణాలు అందజేసే సంస్థలకు ప్రభుత్వ చర్యలతో తాత్కాలిక మద్దతు లభించినా, రుణగ్రస్తులకు వాటిపై నమ్మకం కలిగించే అవకాశాలు లేవని తెలిపింది.

వృద్ధిరేటు మరోసారి తగ్గించిన మూడీస్​
బడ్జెట్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్న వృద్ధిరేటు అంచనాలు... భారత ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న నిర్మాణ, చక్రీయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆశావహ దృక్పథాన్ని చాటేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్​ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ వ్యాఖ్యానించింది.2020-21లో నామమాత్రపు జీడీపీ వృద్ధి 10 శాతం, తరువాతి రెండేళ్లలో వరుసగా 12.6 శాతం, 12.8 శాతం ఉండొచ్చని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.  

also read  రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

మందగమనం వల్ల మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.9 శాతానికే పరిమితమవుతుందని మూడీస్ అంచనా వేసింది. ఇది ప్రభుత్వం అంచనా వేసిన ఐదు శాతం కంటే తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఆరు నుంచి 6.5 శాతంగా ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేయగా, మూడీస్​ మాత్రం ఇది 5.5 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది.

'మందగమనం కొనసాగుతుండడం, బ్యాంకులకు మొండి బాకీలుపెరిగిపోతుండడం వల్ల దేశ వృద్ధిరేటు బలహీనపడుతోంది. ఫలితంగా రుణాలు మంజూరు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు వినియోగం కూడా తగ్గడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది' అని మూడీస్ స్పష్టం చేసింది.
 

click me!