ఫ్రాంకోయిస్ ‘బాంబు’: రాఫెల్‌పై అనిల్ అంబానీ వైపే మోదీ మొగ్గు

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 10:35 AM IST
Highlights

ఫ్రాంకోయిస్ ‘బాంబు’: రాఫెల్‌పై అనిల్ అంబానీ వైపే మోదీ మొగ్గు

న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాఫెల్‌ ఒప్పందంపై మోదీ సర్కార్ షరతులు పెట్టిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తేల్చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాల వ్యవహారంలో అధికార బీజేపీపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ.. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ఓ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలు వాస్తవాలు నిగ్గు తేల్చాయి. రాఫెల్‌ విమానాల ఒప్పందంలో భారత భాగస్వామిగా అనిల్‌ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉండాలని భారత ప్రభుత్వమే అప్పట్లో ఫ్రాన్స్‌ ప్రభుత్వాన్ని కోరిందని ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ వెల్లడించారు. ప్రముఖ ఫ్రెంచ్‌ వెబ్‌సైట్‌ మీడియా పార్ట్‌లో రాసిన ఓ వ్యాసంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఫ్రాంకోయిస్ వ్యాఖ్యలతో డొల్లగా మారిన మోదీ సర్కార్ వాదన
దీంతో భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్) అవసరాల కోసం ఫ్రాన్స్ కు చెందిన దస్సౌల్ట్ సంస్థ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇప్పటివరకు మోదీ సర్కార్ చేస్తున్న వాదన అంతా అబద్దాల పుట్ట అని తేలిపోయింది. రిలయన్స్‌ డిఫెన్స్‌కు యుద్ధ విమానాల తయారీలో పూర్వ అనుభవం లేకపోయినా కావాలనే భారత ప్రభుత్వం ఆ సంస్థకు అసెంబ్లింగ్‌ బాధ్యతను అప్పగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని మోదీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. 

రాఫెల్‌పై రాహుల్‌కు అనిల్ అంబానీ లేఖ ఇలా
భారత్‌లో భాగస్వామిగా రాఫెల్‌ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్‌ తనకు తానే రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థను ఎంచుకుందని ఇందులో తమ ప్రమేయమేమీ లేదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని, ఇది రెండు ప్రైవేట్ సంస్థల మధ్య ఒప్పందం మాత్రమేనని అనిల్‌ అంబానీ గతేడాది డిసెంబర్‌లో రాహుల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో లేవనెత్తినప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం రహస్యమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వాదించారు. తాజాగా యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే 9 శాతం చౌక అని నిర్మలా సీతారామన్ వాదిస్తే.. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చాలా చౌక అని చెప్పారు. వాయుసేన అధికారి 40 శాతం చౌక అని నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థకు యుద్ధ విమానాలను నిర్మించే తాహతు లేదనే స్థాయికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లారు. 

హెచ్‌ఏఎల్‌, డసోల మధ్య ‘తీవ్ర అభిప్రాయ భేదాలు’!
 యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందంపై చర్చలు జరిగినప్పుడు హెచ్‌ఏఎల్‌, దస్సౌల్ట్ ఏవియేషన్‌ సంస్థల మధ్య ‘తీవ్ర అభిప్రాయ భేదాలు’ ఏర్పడ్డాయని అధికారిక వర్గాలు తెలిపాయి. 126 మీడియం మల్టీ రోల్‌ యుద్ధ విమానాల (ఎమ్‌ఎమ్‌ఆర్‌సీఏ) కొనుగోలు కోసం.. ఫ్రాన్స్‌కు చెందిన దస్సౌల్ట్ ఏవియేషన్ సంస్థతో యూపీఏ ప్రభుత్వం 2012లో సంప్రదింపులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వినియోగానికి సిద్ధంగా ఉన్న 18 రాఫెల్‌ విమానాలను సరఫరా చేసి.. మరో 108 విమానాలను లైసెన్స్‌ కింద హెచ్‌ఏఎల్‌తో కలిసి భారత్‌లో నిర్మించాలన్నది ప్రతిపాదన. ఈ ఒప్పందం కుదరలేదు. పనులు పంచుకునే విషయంలో రెండు సంస్థలకున్న అభిప్రాయ భేదాలను ప్రస్తావిస్తూ హెచ్‌ఏఎల్‌ 2012 అక్టోబర్‌ 11న రక్షణశాఖకు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. భారత్‌లో విమానాల తయారీకి సంబంధించి బాధ్యతలను పంచుకునే విషయంలో ఏకాభిప్రాయం కుదరని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. 2014, జులైలో హెచ్‌ఏఎల్‌ మరో లేఖ పంపిందని తెలిపాయి. రాఫెల్‌ విమానాల తయారీ సామర్థ్యం హెచ్‌ఏఎల్‌కు ఉందని నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా తప్పని పేర్కొన్నాయి.

రాఫెల్‌ విమానాలను హెచ్‌ఏఎల్‌ తయారు చేయగలిగేదే! 
పాత ప్రతిపాదనలకు అనుగుణంగానే కేంద్రం రాఫెల్‌ యుద్ధవిమానాలపై ఒప్పందం కుదుర్చుకుని ఉంటే.. వాటిని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మన దేశంలోనే తయారు చేయగలిగేదని ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ టి.సువర్ణ రాజు అన్నారు. పనులు పంచుకునే కాంట్రాక్టుపై రాఫెల్‌ తయారీ సంస్థ దస్సౌల్డ్, హెచ్‌ఏఎల్‌ సంతకాలు కూడా చేశాయని చెప్పారు. వీటికి సంబంధించిన దస్త్రాలను కేంద్రం ఎందుకు బహిర్గతం చేయడం లేదని.. ఇవి బయటకు వస్తే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయని రాజు అన్నారు. ఒక్కో విమానాన్ని ఆశించిన ధరకు హెచ్‌ఏఎల్‌ తయారు చేయలేకపోవచ్చని..అయితే అధునాతన యుద్ధవిమానాల తయారీ సామర్థ్యం సంస్థకు ఉందని రాజు చెప్పారు. రాఫెల్‌ తయారీ హెచ్‌ఏఎల్‌కు ఓ సవాలుగా మాత్రం ఉండేదన్నారు. పాత ప్రతిపాదనల ప్రకారం ఒప్పందం కుదరకపోవడానికి.. తయారీ ఖర్చు పెరగడం, సమయానికి హెచ్‌ఏఎల్‌ విమానాలను అందిస్తుందన్న గ్యారంటీని దస్సౌల్ట్ ఇవ్వలేకపోవడం వంటి కారణాలున్నాయి. విమానాల ఉత్పత్తికి సంబంధించి దస్సౌల్ట్ సంస్థతో అంగీకారం కుదరకపోవడంతోనే యూపీఏ హయాంలోనే ఒప్పందం నుంచి హెచ్‌ఏఎల్‌ను ‘తప్పించారని’ ఇటీవల రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

సుఖోయ్ యుద్ద విమానాల తయారీ ఇలా
‘25 టన్నుల సుఖోయ్‌-30 విమానాలను ముడి పదార్థాల దశ నుంచి హెచ్‌ఏఎల్‌ తయారుచేసింది. రాఫెల్‌ విమానాలనూ తయారుచేయగలిగేదే. భారత్‌లో తయారుచేయడం అనేది వ్యూహాత్మక నిర్ణయం. ఒక్కో విమానం తయారీకయ్యే ఖర్చు కాకుండా.. జీవిత కాల వ్యయాలను చూసుకోవాలి. అంతిమంగా అది స్వయం సమృద్ధికి సంబంధించి విషయం’’ అని హెచ్ఏఎల్ మాజీ చైర్మన్ రాజు వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా డసో తయారు చేసిన మిరాజ్‌-2000 విమానాలకు హెచ్‌ఏఎల్‌ మరమ్మతులను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ నెల 1నే రాజు హెచ్‌ఏఎల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి విరమణ చేశారు. రాఫెల్‌ ఒప్పందం చుట్టూ రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజు తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వివాదంపై హెచ్‌ఏఎల్‌కు చెందిన వ్యక్తులు బహిరంగంగా మాట్లాడటం ఇదే ప్రథమం. ఇటు భారత్‌లో రాఫెల్‌ తయారీ హెచ్‌ఏఎల్‌కు పెద్ద సవాలుగా ఉండేదని భారత వాయుసేన మాజీ ఛీఫ్‌ ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ ఏవై టిప్నిస్‌ వ్యాఖ్యానించారు. అయితే ఫ్రాన్స్‌ నుంచి సాంకేతికత బదిలీతో.. అది అసాధ్యమైన కార్యమైతే కాదని అన్నారు.
 

click me!