‘ఫిచ్’ వృద్ధి రేట్ సరే: రూపీ పతనంతో ధరల మాటేమిటో?

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 10:26 AM IST
Highlights

‘ఫిచ్’ వృద్ధి రేట్ సరే: రూపీ పతనంతో ధరల మాటేమిటో?

కీలకమైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఆపై సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊతమిచ్చే నివేదిక ఒకటి వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పురోగతి సాధిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ తేల్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దుతో దేశ జీడీపీ భారీగా తగ్గిందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి చెందుతోందని ఫిచ్‌ శుక్రవారం తన నివేదికలో ప్రకటించడం విశేషం.

మెరుగ్గానే భారత ఆర్థిక వ్యవస్థ 
‘2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి భారత్‌ జీడీపీ 7.4 % నుంచి 7.8శాతానికి చేరుతుంది. 2018 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మేం అంచనా వేసిన దాని కంటే మెరుగ్గా నమోదైంది’ అని ఫిచ్‌‌ వ్యాఖ్యానించింది. అయితే.. ఈ ఏడాది భారతీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు పడిపోవడం నిరాశ కలిగించే విషయమైనా దాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ అధిగమించడంతోపాటు ఊహించిన దాని కంటే వడ్డీ రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల జీడీపీ వృద్ధి పెరిగే అవకాశం ఉందని ఫిచ్‌‌ తన నివేదికలో సెలవిచ్చింది. 

ధరల పెరుగుదల ప్రభావం ఊసే లేదు
అయితే భారీగా రూపాయి పతనం కావడంతో విదేశీ దిగుమతుల ప్రభావం.. పసిడి, ముడి చమురు దిగుమతి బిల్లు భారత ఆర్థిక వ్యవస్థపై భారీ భారాన్ని మోయనున్నదన్న విమర్శలు ఉన్నాయి. దీని ఫలితంగా కార్పొరేట్ సంస్థలన్నీ తమ ఉత్పత్తులపై ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసే.. సుంకాలు, పన్నుల భారాన్ని వినియోగదారుడిపై మోపి చేతులు దులుపుకుంటాయన్న విమర్శ ఉన్నది. అయినా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 7.7శాతంగా నమోదు కాగలదని ఫిచ్‌‌ అంచనా వేయడం గమనార్హం.

వచ్చే నెల వడ్డీరేట్లు యథాతథమే: నొమురా
క్టోబరులో జరగబోయే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని జపనీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ నోమురా పేర్కొన్నది. వడ్డీరేట్లు పెంచేందుకు రూపాయి బలహీనత అనే ఒక్క కారణం మాత్రమే సరిపోదని నోమురా తన నివేదికలో పేర్కొంది.

‘ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరేందుకు ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుంది.. అయితే రూపాయి బలహీనత, ముడిచమురు ధరలు పెరిగాయనే కారణాలు చూపి వడ్డీరేట్లను పెంచలేరు. ఆగస్టు ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.17శాతం నుంచి 3.69శాతానికి తగ్గింది’ అని నోమురా తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

click me!