ఇలా చేస్తే 2025లోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది

By Naga Surya Phani Kumar  |  First Published Jan 4, 2025, 7:33 AM IST

సొంతిల్లు కట్టుకోవడం చాలా మంది కల. దీని కోసం కొందరు జీవితం మొత్తం కష్టపడతారు. మీరు కూడా కొన్నేళ్లుగా ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారా? కాని అడుగు ముందుకు వేయలేకపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే 2025లోనే మీరు టెన్షన్ లేకుండా ఇల్లు కొనగలుగుతారు. 


ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం జీవిత లక్ష్యం. దాని కోసం ఇష్టాయిస్టాలను కూడా పక్కన పెట్టి డబ్బు దాస్తుంటారు. ఇల్లు కొనాలనే హడావుడిలో కొన్ని విషయాలు మర్చిపోతారు. దీంతో మధ్యవర్తులు, దళారీలు, బిల్డర్లు లాభపడుతుంటారు. ధరలు, పర్మీషన్లు లాంటి కొన్ని విషయాలపై అవగాహన లేకపోతే మీ కష్టార్జితం అంతా మధ్యవర్తుల పాలవుతుంది. అలాంటి ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం రండి. 

కరెక్ట్ ప్లానింగ్ అవసరం

మార్కెట్లో ఆస్తి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత లాభదాయకమైన ఆదాయ మార్గాల్లో ఒకటి. తెలివిగా ఎంచుకున్నప్పుడు గణనీయమైన రాబడి, దీర్ఘకాలిక భద్రత రెండింటినీ అందిస్తుంది. ఇలాంటి పెట్టుబడులు పెట్టిన వారు మాత్రమే ఒక ఇంటిని పూర్తిగా నగదు పెట్టి కొనగలుగుతున్నారు. అంత డబ్బు ఒకేసారి పెట్టలేని వారికి హోమ్ లోన్స్ ఆసరాగా నిలుస్తున్నాయి.

Latest Videos

ఈ సంవత్సరం మీరు ఇల్లు లేదా మరేదైనా ఆస్తిని కొనాలని ప్లాన్ చేస్తే జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి. తెలివిగా ఆలోచించడం, సమాచారం తెలుసుకోవడం ద్వారా సాధారణ నష్టాలను నివారించవచ్చు. 

సరైన బడ్జెట్

ఇల్లు కొనడానికి మొదటి అడుగు వాస్తవిక బడ్జెట్‌ను నిర్ణయించడం. మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. కొనుగోలు ధర మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్, నిర్వహణ, అలంకరణ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణించండి. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఇంటిని ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని నివారించవచ్చు.

ఏజెంట్లు లేకుండా..

సాధ్యమైనంత వరకు ఏజెంట్లను సంప్రదించకుండా ఉంటే కమీషన్లు ఆదా చేయవచ్చు. డెవలపర్ లేదా విక్రేత నుండి నేరుగా కొనడం వల్ల ఆస్తి ధర గణనీయంగా తగ్గుతుంది. డెవలపర్లు ఇంటి ధరలపై చర్చించడానికి నేరుగా కొనుగోలుదారులనే సంప్రదిస్తారు.

ఇలా చేస్తే మీకు సుమారు 2 నుంచి 3 శాతం డబ్బు ఆదా అవుతుంది. అయితే మీరు ఏజెంట్ ద్వారా వెళ్లాలని అనుకుంటే వారిపై మీకు నమ్మకం ఉండాలి. ఆస్తి ఒప్పందాలను నిర్వహించడంలో అనుభవం కలిగిన ఏంజెట్లను ఎంచుకోవడం వల్ల మీ ఆస్తికి భద్రత ఉంటుంది. 

కలిసి కొనండి

సమూహంగా ఇల్లు కొనడం వల్ల మరికొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇద్దర లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే ప్రాజెక్ట్‌లో ఇళ్లను కొనాలని నిర్ణయించుకుంటే డెవలపర్లు ప్రత్యేక తగ్గింపులు లేదా ఆఫర్‌లను అందిస్తారు. ఈ సమిష్టి విధానం ఇల్లు కొనే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

చట్టపరమైన అనుమతులు

గృహ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, డెవలపర్ అవసరమైన అన్ని చట్టపరమైన అనుమతులు పొందారో లేదో నిర్ధారించుకోండి. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలను నివారించడానికి ఈ చర్య చాలా ముఖ్యం. డెవలపర్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించడం ముఖ్యం.

డెవలపర్ గత ప్రాజెక్ట్‌లను సమీక్షించండి. ఆ ప్రాజెక్టులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దీని వల్ల మీ పెట్టుబడిని రక్షణ లభిస్తుంది. 

పండుగ సీజన్ ఆఫర్లు

పండుగ సమయాల్లో డెవలపర్లు, విక్రేతల నుండి ఆకర్షణీయమైన ఆఫర్లు, తగ్గింపులు లభిస్తాయి. ఇల్లు కొనడానికి ఇది చాలా మంచి సమయం. ఇతర సమయాల కంటే మెరుగైన ఒప్పందాన్ని మీరు పొందవచ్చు. అందువల్ల మార్కెట్ లో జరుగుతున్న ప్రమోషన్ల గురించి తెలుసుకోండి.

ధరలు చెక్ చేయండి

మీరు కొనాలనుకున్న ఇంటి ధరను అంగీకరించే ముందు ఆ ప్రాంతంలో ధరల గురించి సమాచారాన్ని సేకరించండి. మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడానికి స్థానికులతో మాట్లాడండి. ఆన్‌లైన్లో  చెక్ చేయండి. ఈ వివరాలు సేకరించడం వల్ల మీరు విక్రేత లేదా డెవలపర్‌తో కరెక్ట్ రేటుకు ఇంటిని అడగగలుగుతారు. 

రుణాలు, ఛార్జీలు

గృహ రుణాలపై ఆధారపడిన వారు, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ఆఫర్‌లను పోల్చి చూడండి. సింపుల్ కండీషన్స్ అందించే బ్యాంకులను మాత్రమే ఎంచుకోండి. అదే విధంగా మీ ఆర్థిక ప్రొఫైల్‌కు సరిపోయే రుణాన్ని ఎంచుకోవడం ఇక్కడ చాలా కీలకమైన విషయం. మీ స్థోమతకు మించి లోన్ తీసుకుంటే మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. 

కాబట్టి సాధ్యమైనంత వరకు ముందస్తుగా చెల్లించడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇల్లు కొనడానికి పూర్తి పరిశోధన, జాగ్రత్తగా ప్రణాళిక, ఆచరణాత్మక విధానం అవసరం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీకు నచ్చిన, విలువైన ఇంటిని కొనుక్కొని మీ కలను సాకారం చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: మీరు డబ్బు దాచుకోవాలంటే ఇవే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్

click me!