భారీగా పెరిగిన బంగారం ధర.. రూ.32వేల మార్క్ దాటేసింది

By ramya neerukondaFirst Published Oct 3, 2018, 4:38 PM IST
Highlights

స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో బంగారం ధర బాగా పెరిగింది. 

మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరింది. నేటి మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో బంగారం ధర బాగా పెరిగింది. ఈరోజు ఒక్క రోజే 500 రూపాయలకు పైగా పెరిగి పది గ్రాముల పసిడి ధర రూ.32వేల మార్కు దాటేసింది. నేటి బులియన్‌ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములకు రూ.555పెరిగి రూ.32,030కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.450 పెరిగి రూ.39,400కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.32శాతం పెరిగి 1207 డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు మరింతగా పడిపోయి రూ.73.41తో తాజా జీవన కాల గరిష్ఠానికి చేరడం కూడా బంగారం ధరపై ప్రభావం చూపినట్లు బులియన్‌ వర్గాలు వెల్లడించాయి.

click me!