పట్టనంటున్న పుత్తడి @ రూ.34, 680

By rajesh yFirst Published Feb 20, 2019, 11:56 AM IST
Highlights

అంతర్జాతీయంగా అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మూడు సెషన్లుగా పుత్తడి ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర క్రితం సెషన్‌లో 1327.64 డాలర్లు పలుకగా, మంగళవారం ఇంట్రా డేలో స్వల్పంగా తగ్గి 1326.48 డాలర్లకు చేరింది. అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరిగి ఔన్స్ ధర 1,329 డాలర్లకు చేరుకున్నది. ఇది గతేడాది ఏప్రిల్ 25వ తేదీ తర్వాత గరిష్ఠ ధర. ఫలితంగా దేశీయ మార్కెట్లో రూ.680 పెరిగి రూ.34,480 వద్ద ముగిసింది. 

న్యూఢిల్లీ: మగువలకు అందునా భారతీయ వనితలకు ఎంతో ఇష్టమైంది పుత్తడి. పెళ్లిళ్లు.. పేరంటాలు.. వేడుకేదైనా బంగారం ఆభరణాలతో అలంకరించుకుంటే మెరిసిపోతుంటారు.. అంతకు మించి మానసికోల్లాసంతో మరింత అందం పుణికి పుచ్చుకుంటారు. 

అంతటి మహాత్యం గల పుత్తడి.. జాతీయంగా.. ప్రత్యేకించి అంతర్జాతీయంగా మార్కెట్లో అనిశ్చితి వల్ల దొరకనంటే దొరకనని అంటోంది. ఇన్వెస్టర్లు తమ మదుపునకు ప్రత్యామ్నాయంగా తొలిసారి అమెరికా డాలర్‌కు బంగారాన్ని ఎంచుకోవడంతో దాని ధర పైపైకి వెళుతోంది. అందువల్ల ఇటీవలి కాలంలో పెరిగి పోతున్నది. 

అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహం పసిడికి అనూహ్యంగా డిమాండ్ రావడంతో దేశీయంగా ధరలు ఎగువముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల ధర మంగళవారం రూ.230 పెరిగి రూ.34, 680కి చేరుకున్నది. 

దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నా, గ్లోబల్ మార్కెట్లలో పది నెలల గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం ఇందుకు కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన మూడు ట్రేడింగ్ రోజుల్లో బంగారం రూ. 680 పెరిగినట్లయింది. 

పుత్తడితోపాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర రూ.100 అందుకొని రూ.41, 350గా నమోదైంది. అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, మరోవైపు బ్రెగ్జిట్ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. 

ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో ఉన్న పెట్టుబడులు అతి విలువైన లోహాల వైపుకు మళ్లించడం ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణమని కమోడిటీ సీనియర్ పరిశోధకుడు తపన్ పటేల్ తెలిపారు. గడిచిన రెండు నెలల్లోనే ధరలు ఏకంగా 14 శాతానికి పైగా పెరిగాయి. న్యూయార్క్ బిలియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,326 డాలర్లు పలుకగా, వెండి 15.82 డాలర్లుగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మంగళవారం 10 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. దీనికి చైనా - అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం చర్చలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర క్రితం సెషన్‌లో 1327.64 డాలర్లు పలుకగా, మంగళవారం ఇంట్రా డేలో స్వల్పంగా తగ్గి 1326.48 డాలర్లకు చేరింది.

ఇది ఏప్రిల్ 25 తర్వాత గరిష్ఠం. అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరిగి ఔన్స్ ధర 1,329 డాలర్లకు చేరుకున్నది. ఇక జనవరిలో పసిడి దిగుమతులు 38.16 శాతం పెరిగాయి. దిగుమతుల విలువ 2.31 బిలియన్లను తాకింది. 

click me!