ట్రేడ్‌వార్‌పై అమెరికా-చైనా మధ్య సయోధ్య కుదిరేనా..?

By Siva KodatiFirst Published Feb 20, 2019, 10:34 AM IST
Highlights

అమెరికా, చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ప్రభావం వర్ధమాన దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి వాషింగ్టన్ లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లోనైనా ఏకాభిప్రాయం లభించేనా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమితంగా ప్రభావం చూపుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం త్వరలోనే ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య యుద్ధానికి చరమ గీతం పలికేందుకు ఇప్పటి వరకు బీజింగ్‌లో చర్చలు జరిగాయి. 

వాణిజ్య పరమైన ఆంక్షలపై మంగళవారం నుంచి వాషింగ్టన్‌లో ఈ చర్చలు జరగనున్నట్లు వైట్ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య షరతులు, ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చర్చలు జరుగుతాయని అమెరికా అధికారులు తెలిపారు.

అంతకు ముందు ఇరు దేశాల మధ్య క్లిష్టతరంగా తయారైన వాణిజ్య యుద్ధానికి వచ్చేనెల ఒకటో తేదీలోపు ముగింపు పలికి ఓ సయోధ్యకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నిర్ణయించారు. గడువుకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య చర్చలు ఊపందుకున్నాయి. 

గత సంవత్సరం చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి అవుతున్న 250 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25శాతం పన్నును పెంచిన విషయం తెలిసిందే. 

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి బదులుగా చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌ కూడా అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అవుతున్న 110 బిలియన్ అమెరికన్‌ డాలర్ల వస్తువులపై పన్నును పెంచారు. 
దీంతో ఇరుదేశాల మధ్య అప్పుడు రగిలిన వాణిజ్య యుద్ధం ఇప్పటికి మండుతూనే ఉంది. ట్రేడ్ వార్‌కు ముగింపు పలికేందుకు యువాన్ విలువ తగ్గించాలని చైనాపై అమెరికా ఒత్తిడి తీసుకు వస్తోంది.

లేకపోతే మార్చి నుంచి మరో 25 శాతం దిగుమతి సుంకం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. రెండు దేశాల మధ్య అంగీకారం కుదరకపోతే వాణిజ్య యుద్ధం మరింతగా పెరిగే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

click me!