ఖబడ్డార్.. డిసిప్లిన్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవ్: కాగ్నిజెంట్‌ వార్నింగ్

By Siva KodatiFirst Published Feb 19, 2019, 11:31 AM IST
Highlights

క్రమశిక్షణారాహిత్యాన్ని ఎంతమాత్రమూ సహించబోమని కాగ్నిజెంట్ సీఈఓ ఫ్రాన్సిస్ డిసౌజా సిబ్బందిని హెచ్చరించారు. తమిళనాడు ప్రభుత్వాధికారులకు భవన నిర్మాణం విషయమై సుమారు రూ.15 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణ సెటిల్మెంట్ కోసం అమెరికా స్టాక్ ఎక్స్జేంజ్ కమిషన్‌కు 25 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

అమెరికా ఐటీ‌ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ తన సంస్థ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక చేసింది. సంస్థ ఉద్యోగులు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కాగ్నిజెంట్‌ సీఈవో ఫ్రాన్సికో డిసౌజా స్పష్టం చేశారు.

సంస్థ పాలసీలు, విధి విధానాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించడంతోపాటు అవినీతి వ్యతిరేక పోరాటం ఎలా సాగించాలో శిక్షణనిస్తామని తెలిపారు. కాగ్నిజెంట్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

చెన్నైలోని తమ సంస్థ విస్తరణకు తమిళ ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వజూపరనే ఆరోపణలు నిజం కావడంతో న్యాయస్థానం కాగ్నిజెంట్‌కు జరిమానా విధించింది. అమెరికా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు కాగ్నిజెంట్‌ 25మిలియన్‌ డాలర్లను చెల్లించాల్సి వచ్చింది. 

ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సీఈవో డిసౌజా మాట్లాడుతూ.. కంపెనీ చరిత్రలో అభివృద్ధి అనేది అనేది కష్టమైన అధ్యాయమని అన్నారు. అదే సమయంలో తీవ్రంగా కష్టపడుతూనే పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వాధికారులకు కాగ్నిజెంట్ ముడుపులు చెల్లించిందన్న విషయమై తమకు సమాచారం లేదని ఇన్ ఫ్రా మేజర్ లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) స్పష్టం చేసింది. దీనిపై వ్యాఖ్యానించబోమని కూడా తెలిపింది. ఎల్ అండ్ టీ సంస్థకు కాగ్నిజెంట్ సుదీర్ఘ కాలంగా ఉన్న క్లయింట్ కావడం గమనార్హం. 

తమిళనాడు ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు నిజమేనని అంగీకరించిన కాగ్నిజెంట్ దీని సెటిల్మెంట్ కోసం అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు దాదాపు రూ.180 కోట్ల (25 మిలియన్ డాలర్లు)ను చెల్లించనున్నది. భారత్‌లో వచ్చిన లంచం ఆరోపణలకు సెటిల్మెంట్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు కాగ్నిజెంట్ అంగీకరించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

కాగ్నిజెంట్ మాజీ ఉద్యోగులపై అమెరికా న్యాయ శాఖ క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘన చర్యలను పరిష్కరించడంలో భాగంగా ఈ మొత్తాన్ని ఎస్‌ఈసీకి కాగ్నిజెంట్ ఇవ్వనున్నది.

అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలో 2.7 మిలియన్ చదరపు అడుగుల కాగ్నిజెంట్ క్యాంపస్ భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచి అనుమతుల కోసం 2014లో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.15 కోట్లు) లంచాన్ని డిమాండ్ చేశారు. 

దీంతో కాగ్నిజెంట్ అధ్యక్షుడు గార్డన్ కోబర్న్, సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్ స్టీవెన్ ఈ స్కార్ట్‌లు ఆ మొత్తాన్ని ఇవ్వాలంటూ కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ లంచం వ్యవహారం బయటకు పొక్కనివ్వకూడదని తమ కిందిస్థాయి అధికారులనూ ఆదేశించారు.

click me!