భగ్గుమన్న బంగారం ధరలు...పది గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...?

By Sandra Ashok Kumar  |  First Published Jan 4, 2020, 11:50 AM IST

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్లకు చమురు సెగ తగిలింది. పది గ్రాముల బంగారం ఒకేరోజు రూ.752 పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.960 అధికమైంది. 


న్యూఢిల్లీ: పుత్తడి ధర మళ్లీ మండుతున్నది. కొన్ని రోజులుగా యథాతథ స్థితిలో కొనసాగిన ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పసిడికి చమురు సెగ తగిలింది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనం కావడంతో అతి విలువైన లోహాల ధరలు అమాంతం పుంజుకోవడానికి పరోక్షంగా దోహద పడ్డాయి. 

దీంతో పుత్తడి పది గ్రాముల ధర మళ్లీ రూ.40 వేల మార్క్‌ను దాటింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర శుక్రవారం ఒకేరోజు రూ.752 అధికమై రూ.40,652 పలికింది. బంగారంతో పాటు వెండి వెలుగులు నింపింది.

Latest Videos

undefined

also read ఒకప్పుడు బిలియనీర్లు... నేడు అప్పులలో కూరుకుపోయి...ఆస్తులు కరిగిపోయి..

పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర రూ.960 పెరిగి రూ.48,870 పలికింది. గురువారం కిలో వెండి ధర రూ.47,910 వద్ద ఉన్నది.  ఇరాన్ కమాండర్‌ను అమెరికా ప్రభుత్వం హత్య చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భగ్గు మన్నాయి. 

దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో పుత్తడి, వెంటి ధరలు ఒకేరోజు భారీగా పుంజుకున్నాయని బులియన్ వ్యాపారులు వెల్లడించారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,547 డాలర్లు పలుకగా, వెండి 18.20 డాలర్లు పలికింది.

బంగారం ధరలు మళ్లీ రూ.41 వేల దిశగా పయనిస్తున్నది. గత నాలుగు నెలలుగా రూ.39 వేల నుంచి రూ.40 వేల లోపు మధ్యలోనే కదలాడిన పుత్తడి ధర ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో వరుసగా రెండు వారాల్లోనే బంగారం ధర రూ.2 వేలకు పైగా అధికమైంది.

ఈవారం ప్రారంభంలో రూ.40 వేల స్థాయిలో ఉన్న ధర చివరకు ముంబైలో రూ.41 వేలు దాటింది. గతేడాది సెప్టెంబర్ తొలివారంలో బంగారం తొలిసారిగా రూ.40 వేలు దాటింది. గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో నూతన సంవత్సరం సందర్భంగా పసిడిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకంజ వేశారని ముంబైలోని ఓ రిటైల్ ఆభరణాల వర్తకుడు వెల్లడించారు.

also read క్రెడిట్, డెబిట్ కార్డుల..పై నెలకు రూ.16 వేల ఆదా చేసుకునే అవకాశం....

స్పాట్ పసిడి ధరలు కూడా రికార్డు స్థాయికి పెరిగాయి. మల్టీ కమొడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో పది గ్రాముల బంగారం (ఫిబ్రవరి కాంట్రాక్ట్) ధర రూ.39,872 వద్ద రికార్డు స్థాయిలో మొదలై ఒకానొక దశలో రూ.40,143 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయిని తాకింది. 
పుత్తడి ధరలు పెరుగడంతో దిగుమతులు అంతకంతకు పతనం అవుతున్నాయి. 


2019లో ఏకంగా 12 శాతం తగ్గాయి. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యల్పం కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 18 శాతం పెరుగడం ఇందుకు కారణం. అయినా 2019 ఏడాది తొలి ఆరు నెలల్లో భారత్‌లో పసిడి డిమాండ్ 372.9 టన్నులకు చేరుకున్నది. 2018 ఏడాది ఇదే సమయంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే 9 శాతం అధికం.

click me!