
సంపద వృద్ధిలో అదానీ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. 2022 ఏప్రిల్‌కు ముందు ఆరు నెలల్లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 88.1 శాతం వృద్ధి చెంది రూ.17.6 లక్షల కోట్లకు చేరిందని బుర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక వెల్లడించింది. 500 దిగ్గజ కంపెనీల సంపద విలువతో ఈ సంస్థ జాబితా రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 13.4 శాతం పెరిగి రూ.18.87 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్ విలువ 0.9 శాతం తగ్గినప్పటికీ రూ. 12.97 లక్షల కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సమీక్షా కాలంలో అదానీ గ్రూప్ కంపెనీలు వాటి విలువను 88.1 శాతం పెంచుకున్నాయి. 500 కంపెనీల విలువ కేవలం రెండు శాతం మాత్రమే పెరిగింది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం.. భారత్ లోని టాప్ 500 కంపెనీల విలువ స్వల్పంగా రెండు శాతం పెరిగి రూ. 221 లక్షల కోట్ల నుంచి రూ. 232 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర కంపెనీలతో పోల్చుకుంటే మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని చూపుతోందని నిపుణులు అంటున్నారు.
అదానీ గ్రూప్ సంస్థల్లో అదాని గ్రీన్ ఎనర్జీ విలువ 139% దూసుకెళ్లి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ విలువలో సంస్థ స్థానం 16 నుంచి 6కు చేరింది. అదానీ విల్మర్ విలువ 190% అధికమై రూ. 66,427 కోట్లుగా, ఆదానీ పవర్ విలువ 157.8% వృద్ధితో రూ.66,185 కోట్లుగా నమోదయ్యాయి. దిగ్గజ 500 కంపెనీల్లో అదానీ గ్రూప్ వాటా 7.6 శాతంగా ఉంది. భారత్‌లో అగ్రగామి 500 కంపెనీల విలువ 2 శాతం పెరిగి రూ. 232 లక్షల కోట్లకు చేరింది. 2021 అక్టోబరు 30న ఇది రూ.221 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో బీఎస్ఈ 30 కంపెనీల విలువ 4 శాతం. నాస్‌డాక్ కంపెనీల విలువ 17 శాతం తగ్గింది. నమోదుకాని కంపెనీల్లో ఎన్ఎస్ఈ విలువ 35,6% పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ 4.6% తగ్గి రూ.1.75 లక్షల కోట్లకు పరిమితమైంది. బైజూస్ విలువ 24.7% పెరిగి రూ.1.68 లక్షల కోట్లకు చేరింది.
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ 17.9% తగ్గి రూ.23,000 కోట్లకు పరిమితమైంది.
సంస్థ స్థానం 34 నుంచి 180కు పడిపోయింది. విలువ పరంగా రాణించిన సంస్థల్లో వేదాంత్ ఫ్యాషన్స్ (313.9%), అదానీ విల్మర్, బిల్ డెస్క్ (172.9%) ఉన్నాయి. అగ్రగామి 500 కంపెనీల జాబితాలో చేరాలంటే కనీస విలువ రూ.5800 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో ముంబయి 159 కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు (59), గురుగ్రామ్ (38) తర్వాత నిలిచాయి.