కార్పొరేట్లకు షాక్: రిలయన్స్ బోర్డులోకి అరుంధతి భట్టాచార్య

By sivanagaprasad kodatiFirst Published Oct 21, 2018, 11:01 AM IST
Highlights

జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే శాసిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఎస్బీఐ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను రిలయన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమించుకున్నది. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అవసరమైన రుణ వసతుల కల్పనకు అరుంధతీ భట్టాచార్య అనుభవం దోహదపడవచ్చునని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 
 

టెలికం రంగంలో ‘జియో’ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) శనివారం మరో సంచలన నిర్ణయం తీసుకుని కార్పొరేట్ మార్కెట్‌ వర్గాలను నివ్వెరపరిచింది. ఇటీవలే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) సారథిగా రిటైరైన అరుంధతి భట్టాచార్య ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ బోర్డులో చేరినట్లు ప్రకటించింది. ఆమె ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. 

పదవీ విరమణ తర్వాత నిబంధనల ప్రకారం బ్యాంక్‌ సారథులు కొన్ని రోజులు ఎలాంటి కీలక పదవులను చేపట్టకుండా 'కూలింగ్‌ పీరియడ్‌' ఉంటుంది. ఇటీవలే భట్టాచార్యకు ఈ నిబంధన పూర్తికావడంతో అరుంధతిని రిలయన్స్‌ తమ సంస్థలోకి చేర్చుకుంది. ఇటీవలే భట్టాచార్యను క్రిస్‌ క్యాపిటల్‌ సంస్థ తమ సలహాదారుగా నియమించుకుంది. మరోవైపు ఆమె పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో అరుంధతి చేరనున్నారన్న వార్తలొచ్చాయి. 

అయితే ఈ లోపే అనూహ్యంగా రిలయన్స్‌ సంస్థ భట్టాచార్యను తమ జట్టులో చేర్చుకున్నట్లు ప్రకటించడంతో కార్పొరేట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. రిలయన్స్‌ సంస్థ బోర్డులో ప్రస్తుతం నీతా అంబానీ ఒక్కరే బోర్డులో మహిళా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అరుంధతి చేరికతో ఈ సంఖ్య రెండుకు చేరనున్నది. రిలయన్స్ బోర్డు సభ్యురాలిగా అరుంధతి భట్టాచర్య ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయవు పట్టులాంటి ఎస్‌బీఐ సంస్థకు అధినేతగా వ్యవహరించిన అరుంధతిని తన బోర్డులోకి చేరుకోవడంతో రిలయన్స్‌ సంస్థకు ఇకపై ఆర్థిక కష్టాలనేవే ఉండకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి మరింత గరిష్టంగా రిలయన్స్‌ అప్పులు పొందేందుకు భట్టాచార్య చేరిక దోహదం చేయగలదని విశ్లేషకులు అంటున్నారు.

ఎస్బీఐ చైర్ పర్సన్‌గా అరుంధతి భట్టాచార్య ఉన్నప్పుడే రిలయన్స్ జియో, ఎస్బీఐ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్, కామర్స్, ఆర్థిక సేవలు అందించేందుకు రెండు సంస్థల భాగస్వామ్యం ఒక వేదిక కానున్నది.

మరోవైపు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న టెక్నాలజీ సంస్థ స్కైట్రాన్ సంస్థలో ముకేశ్ అంబానీ 12.7 శాతం వాటా కొనుగోలు చేసింది. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు స్కైట్రాన్ ఉపకరించనున్నది. 

1977లో ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా కెరీర్ ప్రారంభించిన అరుంధతీ భట్టాచార్య 2013లో బ్యాంక్ తొలి చైర్ పర్సన్ గా సేవలందించి అందరి మన్ననలు పొందారు. నాలుగేళ్ల పాటు చైర్ పర్సన్ గా పని చేసిన అరుంధతీ భట్టాచార్య గతేడాది అక్టోబర్ నెలలో పదవీ విరమణ చేశారు. 

ఎస్బీఐలో ఫారిన్ ఎక్స్చేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, హ్యూమన్ రీసోర్సెస్ విభాగాల్లో పని చేసిన అనుభవం అరుంధతీ భట్టాచార్యది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కూడా సేవలందించారు. 
 

click me!