అమ్మబాబోయ్: మహీంద్రా మరాజోకు యమ డిమాండ్

By narsimha lodeFirst Published Oct 20, 2018, 12:03 PM IST
Highlights

గత నెలలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మల్టీ-పర్పస్ వాహనం మరాజోకు 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు నమోదయ్యాయని యుటిలిటీ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ  మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. 


ముంబై: గత నెలలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మల్టీ-పర్పస్ వాహనం మరాజోకు 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు నమోదయ్యాయని యుటిలిటీ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ  మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధర కలిగిన ఈ వాహనాన్ని గత నెల మూడో తేదీన మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం నెల రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో బుకింగ్‌లు రావడం విశేషమని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ సేల్స్, మార్కెటింగ్ విజయ్ నక్రా తెలిపారు. ఈ కారును మహీంద్రా డిజైన్ స్టూడియో, ఇటాలియన్ డిజైన్ హౌజ్ కలిసి సంయుక్తంగా తీర్చిదిద్దాయి.

మహీంద్రా మరాజోకు చెందిన నాలుగు వేరియంట్లు ఎం2, ఎం4, ఎం6, ఎం8లకు ఆఫర్లు లభిస్తున్నాయి. ధరల్లోనూ ఒక్కోదానికి తేడాలు ఉన్నాయి. అన్ని రకాల మరాజో వాహనాలకు ఏబీఎస్, ఈబీడీ తరహా సేఫ్టీ కిట్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఫోర్ వీల్ డిస్క్ బ్రేక్స్, సెంట్రల్ లాకింగ్, పవర్ విండో ప్లస్ రేర్ ఏసీ తదితర ఫీచర్లు లభిస్తాయి. 

మహీంద్రా మరాజో 123 హెచ్పీ పవర్, 1.5 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్ తోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అవకాశం కూడా ఉంది. అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్‌కు ఆఫర్ వర్తించదు. మహీంద్రా మరాజో మోడల్ తరహాలోనే 2020లో ఏఎంటీ మోడల్ వాహనం మార్కెట్ లోకి వస్తుందని భావిస్తున్నారు. 

నాలుగు వేరియంట్ల మహీంద్రా మరాజోలో ‘ఎం8’ మోడల్ 17 అంగుళాల వీల్స్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ కెమెరాతోపాటు మీరు ఏడు లేదా ఎనిమిది సీట్ల మోడల్ కారును ఎంచుకోవచ్చు. అత్యధికంగా ఎం6, ఎం8 మోడల్ వాహనాల కోసం డిమాండ్ వస్తున్నదని తమ డీలర్లు చెబుతున్నారని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. అయితే వాహనం డెలివరీకి రెండు వారాల నుంచి నెల రోజుల టైం పడుతుందని పేర్కొన్నది. 

click me!