రిలయన్స్ కంపనీ షేర్లు భారీ పతనం... రూ.30 వేల కోట్లు హాంఫట్

By Arun Kumar PFirst Published Oct 20, 2018, 1:30 PM IST
Highlights

ఐదు రోజుల్లో రిలయన్స్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోగా, టాప్ 10 సంస్థల వాటా రూ.2.55 లక్షల కోట్లు పతనమైంది. 

ముంబై: మూడు రోజుల క్రితం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వితీయ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అత్యదికంగా రూ.9,516 కోట్ల లాభాలు గడించినా మార్కెట్ ఇన్వెస్టర్ కరుణించలేదు. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్రో కెమికల్స్ బిజినెస్ రికార్డు స్థాయి ఆదాయం తెచ్చి పెట్టినా లాభాలు తగ్గడం మార్కెట్ లో ప్రతికూల పరిస్థితులకు దారి తీసింది. శుక్రవారం బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిలయన్స్ షేర్ నాలుగు శాతానికి పైగా పతనమైంది. ఒక దశలో 6.59% కోల్పోయి రూ.1,073.15 స్థాయిని తాకింది. చివరకు 4.11 శాతం నష్టంతో రూ.1,101.65 వద్ద ముగిసింది. చివరకు ఈ వారంలో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.29,945 కోట్లు ఆవిరై పోయింది. 

రిలయన్స్ లాభాల సంగతెలా ఉన్నా హెచ్1 బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ కఠినతరం చేయనున్నదన్న వార్తలు సెంటిమెంట్‌ను దెబ్బ తిన్నది. అంతేకాదు.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) నగదు లభ్యతపై నెలకొన్న అనుమానాలు మరోమారు దేశీయ స్టాక్‌ మార్కెట్లను పడదోశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ సంస్థలకు నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు వీలుగా నిబంధనలు సడలించినా మదుపర్ల సంశయాల్ని నివృత్తి చేయలేకపోయాయి. దీంతో ఈ రంగ షేర్లపై ఒత్తిడి పడింది. 

దీనికితోడు ఇంధన, ఐటీ షేర్లు కూడా బాగా పడటంతో సెన్సెక్స్‌ 464 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయాయి. రిలయన్స్ తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 4 శాతానికిపైగా పడిపోవడంతో సూచీలు నేలచూపులు చూశాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. వారం మొత్తం మీద చూస్తే సెన్సెక్స్‌ 418 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు నష్టపోయాయి.

ఇక హెచ్‌1-బీ వీసా నిబంధనల కఠినతరంతో ఐటీ షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 6.16%, టెక్‌ మహీంద్రా 3.98 శాతం మేర కోల్పోయాయి. అంతర్జాతీయ వ్యాపారంలో సవాళ్ల నేపథ్యంలో మైండ్‌ట్రీ షేరు 16 శాతానికిపైగా నష్టపోయింది. బీఎస్‌ఈలో 16.13 శాతం నష్టంతో రూ.821 వద్ద ముగిసింది.

ఎన్‌బీఎఫ్‌సీల ద్రవ్య లభ్యతపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ప్రస్తుత పండుగల సీజన్‌లో విక్రయాలు తగ్గుముఖం పట్టొచ్చన్న అంచనాల నడుమ వాహన రంగ షేర్లు కూడా డీలా పడ్డాయి.

 

click me!