నయా డీల్!: భారత్‌‌లో మహీంద్రాతో కలిసి ఫోర్డ్ కొత్త వెంచర్

By rajesh yFirst Published Apr 10, 2019, 1:47 PM IST
Highlights

అమెరికాకు చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇక భారతదేశంలో స్వతంత్రంగా తన కార్యకలాపాలను, ఉత్పత్తులను నిర్వహించుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఫోర్డ్ మోటార్ కో ఉన్నట్లు సమాచారం. 
 

ముంబై: అమెరికాకు చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇక భారతదేశంలో స్వతంత్రంగా తన కార్యకలాపాలను, ఉత్పత్తులను నిర్వహించుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఫోర్డ్ మోటార్ కో ఉన్నట్లు సమాచారం. 

ఈ డీల్‌తో కొత్త ఆటోమొబైల్ తయారీ సంస్థ భారత్‌లో ఏర్పడనుంది. ఆ వెంచర్ ద్వారానే ఫోర్డ్-మహీంద్రా కార్యకలపాలు కొనసాగే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల క్రితమే భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫోర్డ్.. దాదాపు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 

అయితే, ఇక్కడి మార్కెట్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో కేవలం మూడు శాతం వాటానే కలిగివుంది. ఈ క్రమంలో భారత వాహన తయారీ దిగ్గజం మహీంద్రాతో జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మహీంద్రా-ఫోర్డ్ డీల్ కుదిరితే.. వీటి ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త వెంచర్‌లో ఫోర్డ్‌కు 49శాతం వాటా, మహీంద్రాకు 51శాతం వాటా ఉంటుంది. ఫోర్డుకు భారత్‌లో ఉన్న వ్యాపార కార్యాలపాలను ఇక కొత్త సంస్థకు పూర్తిగా మళ్లించే అవకాశం ఉంది.

ఫోర్డు ఆస్తులు, ఉద్యోగులు కూడా కొత్త సంస్థకు బదిలీ అవుతారు. అంటే ఫోర్డు భారత మార్కెట్లో నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. కాగా, ఈ కొత్త డీల్ మరో 90రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే, ఒప్పందంపై స్పందించేందుకు ఫోర్డు అంగీకరించలేదు. 

కానీ, రెండు కంపెనీలు మాత్రం వాణిజ్య సామర్థ్యాలను పెంచుకునేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మక సహకారం ఉంటుందని వెల్లడించింది. ఇక మహీంద్రా కూడా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, 2017లో ఫోర్డు మహీంద్రాతో కలిసి కొత్త కార్ల తయారీ, ఎస్‌యూవీల తయారీ, ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాయి. 

click me!