వాల్‌మార్ట్‌తో డీల్: ఇక మిలియనీర్లు ఫ్లిప్‌కార్ట్ స్టాఫ్

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 8:15 AM IST
Highlights

వాల్‌మార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందం వల్ల ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు ముందే దసరా పండుగ వచ్చేసిందా? అంటే పరిస్థితి అలాగే ఉన్నది. ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం ప్రకారం 62 లక్షల షేర్లు కొనాలంటే ఆ సంస్థ సిబ్బంది షేర్లు కూడా కొనుగోలు చేయాల్సి రావడమే దీనికి కారణం.

దేశీయ ఈ- కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగులు పూర్తిగా సంబురాల్లో నిండిపోయారు. వారికి దసరా దాదాపు నెల రోజుల ముందే వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోవడమే దీనికి కారణం. 16 బిలియన్‌ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కూడా ఇటీవలే ఆమోదం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌.. వాల్‌మార్ట్ సొంతమై నాలుగున్నర నెలలైంది. 

ఫ్లిప్‌కార్ట్‌ షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ తన ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ఎంప్లాయి స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఈఎస్ఓపీస్) కింద 126- 128 డాలర్ల (ఒక్కో యూనిట్‌) విలువైన షేర్లను విక్రయించేందుకు అనుమతి ఇస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్టు ఉద్యోగులు మిలియనీర్లుగా మారబోతున్నారు.

అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లోని 1,19,47, 026 షేర్లలో కనీసం 62,42, 271 షేర్లను తప్పనిసరిగా కొనుగోలు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇందులో ఈఎస్‌ఓపీ కింద ఉన్న షేర్ల విలువ సుమారు 1.5 బిలియన్‌ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్‌ 126- 128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు అవకాశం దక్కింది. 

‘మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్లు ఆర్జించనున్నారు’  అని ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ రెండు ఆన్‌లైన్‌ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్‌ఓపీ కింద 100 శాతం వాటాను విక్రయించవచ్చు.

అయితే ఉద్యోగులు తమ వాటాల్లో ఈ ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది 25 శాతం, 2020లో మరో 25 శాతం వాటాను నగదుగా మార్చుకునే వీలు కల్పించింది ఫ్లిప్‌కార్ట్ కంపెనీ యాజమాన్యం. కాగా తాము పనిచేస్తున్న కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలు చేసేందుకు ఈఎస్‌ఓపీ అనేది ఒక ప్రయోజనకర ప్లాన్‌. మిగతా ఉద్యోగుల 25 శాతం షేర్లు కూడా ఈఎస్ఓపీస్ కింద రెండేళ్లలో కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంది. 

click me!
Last Updated Sep 21, 2018, 8:15 AM IST
click me!