
Meta layoffs: ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కంపెనీ గత ఏడాది నవంబర్ లో 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ వారంలో మరింత మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వేలాది మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నదని సమాచారం. ప్రకటనల ఆదాయం మందగించిన నేపథ్యంలో, తొలగించగల ఉద్యోగుల జాబితాలను తయారు చేయమని మెటా డైరెక్టర్లు, ఉపాధ్యక్షులను కోరుతోందని తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ బ్లూమ్ బర్గ్ నివేదించింది. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ తన మూడవ బిడ్డ కోసం తల్లిదండ్రుల సెలవుపై వెళ్ళడానికి ముందు వచ్చే వారంలో తాజా తొలగింపులను ఖరారు చేయవచ్చని నివేదిక తెలిపింది.
వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నంలో మెటా గత ఏడాది నవంబర్ లో తొలగించిన 12000 మంది ఉద్యోగులు లేదా దాని గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 13 శాతం మందికి ఆదనంగా తాజా తొలగింపులు ఉంటాయని సమాచారం. మెటా ఉద్యోగులతో పంచుకున్న ఒక ప్రకటనలో, జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. కంపెనీ అనవసర ఖర్చులను తగ్గించుకునే చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త నియామకాలు ఇప్పట్లో ఉండవని చెప్పారు. 'దురదృష్టవశాత్తూ ప్రస్తుతం నేను ఆశించిన విధంగా జరగలేదు. ఆన్ లైన్ వాణిజ్యం మునుపటి ధోరణులకు తిరిగి రావడమే కాకుండా, స్థూల ఆర్థిక మాంద్యం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గిపోవడంతో మా ఆదాయాన్ని నేను ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉండటానికి కారణమయ్యాయి. ఈ పరిస్థితులకు నేను బాధ్యత వహిస్తాను" అని జుకర్ బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కంపెనీ తన సంస్థ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే, ఇటీవల సంస్థ సిబ్బంది పనితీరుపై తక్కువ రేటింగ్ లు ఇవ్వడం, తొలగింపు అంశంపై జరుగుతున్న చర్చలు ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అంతర్జాతీయ మాంద్య అంచనా పరిస్థితుల మధ్య ఇలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను వదిలించుకోవడంపై చిన్న కంపెనీల పనిచేసే వారు సైతం తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన పడుతున్నారు.