
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం రోజురోజుకి మరింత ముదిరుతోంది. దీంతో ముడిచమురు ధర కూడా అగ్నికి ఆహుతైంది. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5 డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ బలమైన పెరుగుదల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటింది. దీని ప్రభావం భారత్‌తో సహా ఇతర దేశాలపైనా పడనుంది.
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరితే అప్పుడు ముడి చమురు ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనివల్ల భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అలాగే ఇంధన ధరలు రూ. 10 నుండి 15 వరకు పెరగవచ్చు. విశేషమేమిటంటే, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశంలో ఆహార పదార్థాలపై ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది, ఎందుకంటే సరుకు రవాణా ఖర్చు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో భారతదేశం ముందుముందు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. అంటే, స్పష్టమైన మాటల్లో చెప్పాలంటే ముడి చమురు ధరల్లో ఈ పెంపు భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ముడి చమురు, సహజ వాయువు, రత్నాలు, ఆభరణాలు, ఎడిబుల్ ఆయిల్, ఎరువుల దిగుమతులపై భారతదేశం పూర్తిగా ఈ దేశాలపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం నిరంతరం భారత కరెన్సీపై పడుతోంది. నివేదిక ప్రకారం, ఈ అన్ని కారణాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో దిగుమతి బిల్లు యూఎస్ 492.9 బిలియన్ల డాలర్లుగా ఉంది.
భారతదేశం ముడి చమురు, గ్యాస్ ప్రధాన దిగుమతిదారి
భారతదేశం ముడి చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో 50 శాతం దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రెండింటి ధర పెరిగితే భారత్ దిగుమతి బిల్లు పెరుగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆకాశాన్ని తాకగా, మరోవైపు గ్యాస్ ధర కూడా పెరిగింది. భారతదేశ దిగుమతి బిల్లు 600 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేయడానికి ఇదే కారణం.
42 శాతం కుటుంబాలు ఖర్చులను తగ్గించుకుంటాయి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరగడంతో.. దేశీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరల భయం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడాన్ని తట్టుకోలేక నిత్యావసర వస్తువులు కొనడం మానేస్తామని 42 శాతం కుటుంబాలు గతంలో లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 24 శాతం మంది ఇప్పటికే అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం మానేశారని చెప్పారు.