విచారణలో సహాయ నిరాకరణ.. ఈడీ కస్టడీలో రాణా కపూర్...?

By Sandra Ashok Kumar  |  First Published Mar 8, 2020, 10:07 AM IST

ఎట్టకేలకు యెస్ బ్యాంకు సంక్షోభంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.


ముంబై: సంక్షోభంలో చిక్కుకుపోయిన యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు రాణా కపూర్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. 

బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. శుక్రవారం ముంబైలోని ఆయన నివాసంలో సోదాలు జరిపినప్పుడు రాణా కపూర్‌ను ప్రశ్నించారు. తర్వాత విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెల్లవారుజామున ఈడీ అధికారులు ప్రకటించారు.

Latest Videos

undefined

also read యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు

తమ విచారణలో రాణా కపూర్ సహకరించకపోవడం వల్లే ఆయనను తాము అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి తమ కస్టడీకి అప్పగించాలని కోరతామన్నారు. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థతోపాటు మరో సంస్థకు ఇచ్చిన రుణాల్లో రాణా కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 

యెస్ బ్యాంకు ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకోవడానికి దారి తీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నదని అనుమానిస్తున్నారు. శనివారం రాణా కపూర్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లలోనూ తనిఖీలు జరిపి మరింత సాక్షాధారాలతో కూడిన సమాచారం సేకరించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 

also read యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..

ఈ పరిణామాల అనంతరం ‘ఇప్పుడు యెస్ బ్యాంకు డెబిట్ కార్డుల ద్వారా యెస్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో డబ్బుడులు విత్ డ్రా చేసుకోవచ్చు’ అని బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. గత మూడు రోజులుగా బ్యాంకు ఖాతాదారులు నగదు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాయల్స్‌కు యెస్ బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత యెస్ బ్యాంకుపై 30 రోజుల మారటోరియం విధించిన ఆర్బీఐ.. విత్ డ్రాయల్స్‌పై రూ.50 వేల పరిమితి విధించడంతో ఇబ్బందులు తలెత్తాయి.
 

click me!