యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..

యెస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన మారటోరియం మదుపర్లలో ఆందోళనను పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల అల్లాడిపోతున్న స్టాక్ మార్కెట్లపై యెస్ బ్యాంకుపై ఆర్బీఐ నిర్ణయం శరాఘాతంలా మారింది. యెస్‌ బ్యాంక్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక దశలో 1,400 పాయింట్లు నష్టపోయిన సూచీ.. చివరకు 834 పాయింట్ల పతనంతో సరి పెట్టుకుంది. ఫలితంగా రూ.3.28 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 11 వేల దిగువకు పడిపోయింది.  

Sensex crashes 894 points: Coronavirus, YES Bank & other factors behind fall

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం సెగ గట్టిగానే తగిలింది. ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌తో పాతాళంలోకి పడిపోయిన స్టాక్‌ మార్కెట్లకు తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను కుదిపేశాయి. శుక్రవారం ఈక్విటీ మార్కెట్లకు బ్లాక్‌ఫ్రైడేగా నిలిచింది. 

ప్రారంభం నుంచి నష్టాల బాటపట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకూతాలు మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. అంతర్గత ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 1,400 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు 893.99 పాయింట్ల నష్టంతో 37,576.62 వద్ద ముగిసింది.

also read మీ డబ్బు ఎక్కడికి పోదు, భద్రంగా ఉంది : ఆర్థిక మంత్రి

సెన్సెక్స్ 38 వేల దిగువకు పడిపోవడం గడిచిన మూడు నెలల్లో ఇదే తొలిసారి. 37,613.96 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 37,747.07 గరిష్ఠ స్థాయి, 37,011.09 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 11 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. దీంతో రూ.3.28 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. 

బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3,28,684.50 కోట్లు తగ్గి రూ.1,44,31,224.41 కోట్లకు పరిమితమైంది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్‌ 720.67 పాయింట్లు (1.88శాతం), నిఫ్టీ 212.30 పాయిం ట్లు(1.89శాతం) పతనం చెందాయి.

యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం మొత్తం బ్యాంకింగ్‌ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. యెస్‌ బ్యాంక్‌కు మారటోరియం, డిపాజిట్ల విత్‌డ్రాలపై పరిమితులతో ఒక దశలో 85 శాతానికి పైగా నష్టపోయిన బ్యాంక్‌ షేర్ ధర చివరకు ఇంతటి భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి షేరు ధర 56.04 శాతం పతనమై రూ.16.20 వద్ద ముగిసింది. 

దీంతో యెస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.5,432.02 కోట్లు తగ్గి రూ.3,927.73 కోట్లకు పడిపోయింది. పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిను రిజర్వు బ్యాంక్‌ ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో చివరికి కోలుకున్నది. వీటితోపాటు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 14 శాతం, ఎస్బీఐ 6.19 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5.62 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.67 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.90 శాతం చొప్పున నష్టపోయాయి. 

బీఎస్‌ఈ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.46 శాతం క్షీణత కనబరిచింది. 30 షేర్ల ఇండెక్స్‌లో 27 షేర్లు నష్టాలను నమోదు చేసుకోగా, కేవలం మూడంటే మూడు లాభాల్లో ముగిశాయి.  వారాంతం ట్రేడింగ్‌లో టాటా స్టీల్‌ 6.51 శాతం పతనం చెంది టాప్‌ లూజర్‌గా నిలిచింది.  

Sensex crashes 894 points: Coronavirus, YES Bank & other factors behind fall

హెచ్‌డీఎఫ్‌సీ 3.90 శాతం, ఓఎన్‌జీసీ 3.62 %, ఐటీసీ 3.27 శాతం, రిలయన్స్‌ 3.16%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.90 శాతం, పవర్‌గ్రిడ్‌ 2.73%, ఎన్‌టీపీసీ 2.69 శాతం, బజాజ్‌ ఫిన్‌ 2.51%, ఇన్ఫోసిస్‌ 2.04 శాతం, ఎల్‌అండ్‌టీ 2.01%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.86 శాతం, మ హీంద్రా 1.73 శాతం, టెక్‌ మహీంద్రా 1. 67%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.53%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1. 46%, హెచ్‌యూఎల్‌ 1.33%, హీరో మో టోకార్ప్‌ 1.29%, టై టన్‌ 1.28%, కొటక్‌ బ్యాంక్‌ 1.17%, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లె, టీసీఎస్‌ నష్టపోయాయి. 

కేవలం బజాజ్‌ ఆటో, మారుతి, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రం లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా మెటల్‌  బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, ఎనర్జీ, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, ఇండస్ట్రీయల్‌ రంగ షేర్లు తగ్గుముఖం పట్టాయి. 

ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ పతనం కొనసాగుతున్నది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 54 పైసలు కోల్పోయి 73.87 వద్దకు పతనమైంది. కరోనా వైరస్‌ మరింత ముదురుతుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొనడం ఈక్విటీలు, ఫారెక్స్‌ మార్కెట్లో ఆందోళనను మరింత పెంచింది. ప్రారంభంలోనే 73.94 స్థాయికి పడిపోయిన కరెన్సీ విలువ చివరి వరకు ఇలాగే కొనసాగింది. 

యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ ఇంటిలో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు నిర్వహించింది. మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి శుక్రవారం పశ్చిమ ముంబైలో కపూర్‌కు ఉన్న సముద్ర మహల్‌ ఇంటిపై దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 

పీఎంఎల్‌ఏ కింద నమోదైన కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో రాణా కపూర్‌ను ప్రశించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కపూర్‌ భార్యకు కార్పొరేట్‌ రుణాల అందజేతకు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఈడీ..ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి ఈ దాడులు చేసింది.  

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెస్‌ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సుముఖత వ్యక్తం చేసినట్టు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది. ఇందుకోసం ‘యెస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పునర్‌వ్యవస్థీకరణ-2020’ పేరిట ఆర్బీఐ ఓ ముసాయిదా తీసుకొచ్చింది. 

also read కొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు...10 గ్రాములకి ఎంతంటే ?

యెస్‌ బ్యాంకులో పెట్టుబడి పెట్టే ప్రధాన బ్యాంకు (ఎస్‌బీఐ) 49 శాతం వాటాను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి తదుపరి మూడేళ్లలో ప్రధాన బ్యాంకు తన వాటాను 26 శాతం కంటే తక్కువకు తగ్గించుకొనేందుకు వీల్లేదని ఆర్బీఐ ఆ ముసాయిదాలో పేర్కొన్నది. 

యెస్‌ బ్యాంకు పునర్‌వ్యవస్థీకరణ అనంతరం దానిలో 49 శాతం మేరకు వాటాను కలిగి ఉండేలా పెట్టుబడి పెట్టేందుకు ప్రధాన బ్యాంకు అంగీకరించాల్సి ఉంటుందని, పునర్‌వ్యవస్థీకృత బ్యాంకులో ప్రధాన బ్యాంకు షేరు విలువ రూ.10కి (ముఖ విలువ రూ.2కు), ప్రీమియం రూ.8కి తగ్గకుండా ఉండాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. 

అపాయింటెడ్‌ డే నుంచి యెస్‌ బ్యాంకు అధీకృత పెట్టుబడి రూ.5 వేల కోట్లకు, దాని ఈక్విటీల సంఖ్య 2,400 (ఒక్కో ఈక్విటీ ముఖ విలువ రూ.2)కు మార్చబడుతుందని ఆర్బీఐ తన ముసాయిదాలో పేర్కొన్నది. 

యెస్‌ బ్యాంకు సంక్షోభాన్ని 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హామీ ఇచ్చారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో స్థిరత్వాన్ని సాధించేందుకే యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధించామని చెప్పారు. బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇదే సరైన తరుణమని, యెస్‌ బ్యాంకును పునరుద్ధరించేందుకు త్వరలోనే కొత్త పథకంతో ముందుకు వస్తామని ఆయన తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios