బ్యాంకర్లను ‘బిగ్ బీ’ కించపరిచారా?!: నల్లధనం సంగతి సరే.. నగదు నిల్వ పరిమితి పెంచాలా?

First Published Jul 20, 2018, 10:40 AM IST
Highlights

ఒక జ్యువెల్లరీ సంస్థ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో బిగ్ బీ అమితాబ్, ఆయన తనయ శ్వేతానంద వ్యాఖ్యలు అభ్యంతరకరమని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫిడరేషన్ (ఏఓబీఓసీ) పేర్కొన్నది. న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ఒక ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ ప్రకటన తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ ప్రకటనపై బ్యాంకర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆభరణాల సంస్థ కోసం బిగ్‌ బి తొలిసారిగా తన కుమార్తె శ్వేత నందతో కలిసి ఓ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అందులో బ్యాంకింగ్‌ వ్యవస్థను తక్కువ చేసి చూపారని, బురద చల్లారని ఇది చాలా అమర్యాదకరంగా, అసహ్యంగా ఉందని బ్యాంకు యూనియన్లు మండిపడుతున్నాయి. బ్యాంకర్లను తక్కువ చేసి చూపినందుకు కేరళ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు జరుపుతున్న జ్యువెలరీ చైన్ ‘కల్యాణ్ జ్యువెలరీ’స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్న అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం


3.20 లక్షల మంది అధికారుల సభ్యత్వం గల ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్యాంకుల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఈ ప్రకటన ఉందని ఏఐబీఓసీ జనరల్‌ సెక్రటరీ సౌమ్య దత్తా మండిపడ్డారు. ప్రకటనను తొలగించాలి లేదంటే ధర్నాలు చేసేందుకు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోము' అని దత్తా హెచ్చరించారు. పూర్తిగా వాణిజ్య ప్రయోజనాల కోసం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తారా? అని మండిపడ్డారు. 

నష్ట నివారణ చర్యలు చేపట్టిన జ్యువెల్లరీ సంస్థ


సదరు ప్రకటనలపై బ్యాంకర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆభరణాల సంస్థ నష్టనివారణ చర్యలకు దిగింది. 'ప్రకటనలో చూపింది కేవలం కల్పితం మాత్రమేనని బ్యాంకర్లను తక్కువగా చేసి చూపాలనే ఉద్దేశం ఇందులో ఎంతమాత్రం లేదని తెలిపింది. దయచేసి ఈ ప్రకటనతోపాటు తాము అందిస్తున్న గమనికను పరిశీలించండని కోరింది. ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. ఏ ఒక్క వ్యక్తినీ, కమ్యూనిటీని కించపరచాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు' అని సదరు ఆభరణాల సంస్థ దత్తాకు లేఖ రాసింది. కానీ ఈ ప్రకటనను తొలగించే వరకు తాము వెనకడుగువేసేది లేదని బ్యాంక్‌ ఉద్యోగులు అంటున్నారు.

ఇదీ బిగ్ బీ వాణిజ్య ప్రకటన


వాణిజ్య ప్రకటనలో బచ్చన్ ఒక సీనియర్ సిటిజన్‌గా, ఆయన కూతురు శ్వేతాబచ్చన్ నందా కుమార్తెగా పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనలో బిగ్ బీ ఒక చిత్తశుద్ది గల నిజాయితీ పరుడిగా బ్యాంకు తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసిన అదనపు మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించేందుకు కూతురుతో కలిసి బ్యాంకుకు వస్తాడు. దీనికి సంబంధించి బ్యాంకు అధికారులకు, ఆయనకు మధ్య జరిగిన సంభాషణ సీనియర్ సిటిజన్‌గా బిగ్ బీని కలచివేసినట్లు ఉంటుంది. ఈ వాణిజ్య ప్రకటన వీడియోను అమితాబ్.. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడంతో బయటపడింది. మలయాళంలో ప్రముఖ నటి మంజూ వారియర్.. బిగ్ బి తనయగా నటించారు. కానీ వాణిజ్య ప్రకటన పూర్తి విషయాలు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు తెలిసి ఉండకపోవచ్చునని బ్యాంకింగ్ అధికారుల సంఘం సందేహం వ్యక్తం చేసింది. ఈ వానిజ్య ప్రకటన పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థను అపసహ్యం చేయడమేనని ఏఐబీఓసీ సెక్రటరీ జనరల్ సౌమ్య దత్తా పేర్కొన్నారు. టీవీలో యాడ్ ప్రసారమవుతున్నప్పుడు చిత్తశుద్ధి, నిజాయితీ గురించి ఎవరూ పట్టించుకోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కల్యాణ్ జ్యువెలరీస్ దిగిరాకపోతే తమ సంఘం తరఫున న్యాయపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఆందోళనకు కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. 

నల్లధనం వెలికితీతకేనా షా కమిషన్.. జనం వద్ద రూ. కోటి ఉండాలని సిఫారసు


దేశంలో వ్యక్తులు తమ వద్ద ఉంచుకునే నగదు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సిఫారసు చేసింది. అంతక్రితం ఈ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు పెంచాలని సూచించిన సిట్‌.. అనతి కాలంలోనే దీనిని తాజాగా రూ.కోటి వరకు పెంచాలని సిఫారసు చేయడం విశేషం. ఇటీవల తమ సోదాల్లో ఎక్కడ చూసినా కోట్లలో నగదు నిల్వలు వెలుగు చూస్తున్న వేళ సిట్‌ తాజా సిఫారసు చేస్తున్నట్టు వివరించింది. 'వ్యక్తుల వద్ద నగదు నిల్వల పరిమితిని రూ.కోటి వరకు పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. రూ.కోటి కంటే ఎక్కువగా ఉన్న మొత్తం వెలుగు చూసే నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ప్రతిపాదించాం' అని సిట్‌ అధినేత మాజీ న్యాయాధిపతి ఎంబీ షా మీడియాకు తెలిపారు.


40 శాతం ఐటీ కట్టి మిగతా నగదు పొందొచ్చు ఇలా


ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అధికారులు నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత నిందితులు 40 శాతం ఆదాయం పన్ను, జరిమానా కట్టి మిగతా నగదును తిరిగి పొందవచ్చని చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్ ఎంబీ షా అన్నారు. 'ఈ మధ్య స్వాధీనం చేసుకున్న నగదును చూడండి. రూ. 160 కోట్లు, రూ. 177కోట్లు.. ఇలా ఉంటున్నాయి.. ఇలా పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉండటంతో రూ.20లక్షల పరిమితి సవరించాలని మేము అభిప్రాయపడ్డాం. కోటికి పెంచితే బాగుంటుందని భావిస్తున్నాం' అని షా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014లో నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే.

click me!