మోదీ గారు.. మాకు ఆ టాబ్లెట్లు వెంటనే పంపండి: ట్రంప్

By Sandra Ashok KumarFirst Published Apr 5, 2020, 2:16 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా చివురుటాకుల వణికిపోతున్న అమెరికా అధ్యక్షుడు తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ టాబ్లెట్లు సరఫరా చేయాలని భారత ప్రధాని మోదీని అభ్యర్థించారు. భారత్‌లో కొవిడ్-19 చికిత్సకు ఈ ఔషధాన్ని వాడాలని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 

వాషింగ్టన్‌: కరోనా వైరస్ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాలను తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్రమోదీని కోరానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. 
కరోనా వైరస్‌ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల మంది వైరస్‌ బారిన పడగా.. వేల మంది ప్రాణాలను కోల్పోయారు. 

సామాన్యుల సంగతలా ఉంచితే ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారంటే వైరస్‌ తీవ్రత ఏవిధంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సాయం కోరారు.

మలేరియా నిరోధానికి వాడే హైడ్రా​క్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. కొవిడ్-19 చికిత్సకు హైడ్రా క్లోరోక్వీన్ వాడొచ్చని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

కనుక కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. ఈ మేరకు శనివారం మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను యూఎస్‌కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు భారత్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిపై ఇప్పటివరకు ఉన్న నిషేదాన్ని తొలగించాలని భావిస్తోంది. మార్చి 25న హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఎగుమతులను నిషేధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా ద్రుక్పథంతో కొన్ని మినహాయింపులిచ్చింది.

‘ఇలాంటి విపత్కర సమయంలో మోదీని హైడ్రాక్వీ క్లోరోక్విన్ టాబ్లెట్ల సరఫరా చేయమని విజ్ఞప్తి చేశాను’ అని  ట్రంప్ పేర్కొన్నారు.  ఈ మెడిసిన్‌ కోసం అమెరికా ఇప్పటికే భారత్‌కు ఆర్డర్ అందించిందని, అయితే, ప్రస్తుతం భారత నిషేధం అమలులో ఉన్నందున ఇంకా సరఫరా జరగలేదని ట్రంప్ చెప్పారు. 

కాగా కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగం‍గా శనివారం వైట్‌హౌస్‌లో యూఎస్‌ అధికారులతో సమీక్ష చేపట్టిన ట్రంప్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడం చేయడం అభినందనీయమన్నారు.

కాగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహ్మమారిని తరిమి కొట్టేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటామని మోదీ పేర్కొన్నారు.

click me!