ట్రేడ్ వార్‌కు తెర.. టారిఫ్‌లు యధాతథం

By telugu teamFirst Published Jan 16, 2020, 2:31 PM IST
Highlights

దాదాపు రెండేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్, చైనా ఉప ప్రధాని లియూ హీ సంతకాలు చేశారు. కానీ దిగుమతి సుంకాలు యధాతథంగా కొనసాగించడం గమనార్హం. 

దాదాపు 18 నెలల వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా-చైనా ముందడుగు వేశాయి. దాదాపు ఏడాది ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ఉపప్రధాని లియూ హీ ఒప్పందంపై సంతకం చేశారు. 

అయితే చైనా ఎగుమతులపై సుంకాల తగ్గింపును మాత్రం ఒప్పందంలో చేర్చకపోవడం గమనార్హం. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదిలీకి ముగింపు, వివాదాల పరిష్కారాలకు సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. 

Also Read మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్...
ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగనున్నాయి. 2021 నాటికి చైనా 200 బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా వస్తువులు, సర్వీసులను పొందేందుకు ఈ ఒప్పందంలో చేర్చారు. 

దీంతో కొన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా ఆంక్షలు, టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఉంది. చైనా దిగుమతులపై 360 బిలియన్ల డాలర్ల టారిఫ్‌లు విధించారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ లు యధాతథంగా కొనసాగించడం ద్వారా భవిష్యత్‌లో తేడా వస్తే చైనాపై టారిఫ్ లు విధిస్తామన్న హెచ్చరికలను పరోక్షంగా కొనసాగించాలన్నది అమెరికా వ్యూహంగా ఉంది. 

ఈ ఒప్పందాన్ని ట్రంప్‌ చరిత్మాత్మకమైనదిగా అభివర్ణించారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య న్యాయమైన పరస్పర వాణిజ్యానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల తగ్గింపుపై రెండో దశ ఒప్పందంలో పరిశీలిస్తామని తెలిపారు. తాజా ఒప్పందంతో అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. 


 

click me!