ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్‌ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్

By telugu team  |  First Published Jan 16, 2020, 11:50 AM IST

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ నిర్ణయానికి వచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఎటీఎం కేంద్రాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలను ముందుకు తీసుకొచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.


 బ్యాంకింగ్ వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అక్రమాలకు చెక్‌ పెట్టడంతోపాటు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఈ నిబంధనలను తీసుకువచ్చింది. 

ఆర్థిక లావాదేవీల్లో భద్రత మరింత బలోపేతం కావడానికి ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న ఈ ముందు జాగ్రత్త చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Latest Videos

క్రెడిట్, డెబిట్ కార్డులను  ఏటీఎం, పీఓఎస్  పరికరాలతోనే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఆర్బీఐ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‪లో తెలిపింది. అలాగే ఈ కార్డులను (అంతర్జాతీయమా, దేశీయమా) వినియోగాన్ని నియంత్రించుకునే అధికారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. 

ఈ కొత్త నిబంధనలు 2020 మార్చి16వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం​ భారతదేశంలో ఏటీఎం,  పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) లాంటి కాంటాక్ట్-బేస్డ్ యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు.

ఏ వ్యక్తైనా ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, ఈ సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు. తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి.

ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగదారుల కోసం దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపి వేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులపై ఈ సేవలను తప్పనిసరిగా (మాండేటరీ) నిలిపివేయబడతాయని స్పష్టం చేసింది. 

Also Read వేతన సవరణకు పట్టు.. 31 నుంచి రెండు రోజుల బ్యాంకుల సమ్మె...

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగంలో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ సూచించింది. అందుబాటులో ఉన్న అన్ని చానెళ్లలో 24 గంటల పాటు ఎటీఎం, డెబిట్ కార్డులను వినియోగించుకోవడానికి ఖాతాదారులకు బ్యాంకర్లు స్వేచ్ఛనిచ్చాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్లు, ఏటీఎంలు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా బ్యాంకింగ్ ఖాతాదారులు ఈ సేవలు పొందేందుకు వీలు ఉంది. 

ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, స్మార్ట్ కార్డులకు, ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రో, బెంగళూరు మెట్రో వంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్బీఐ వివరించింది. అన్ని ఏటీఎంలు, పీఓఎస్‌ డివైస్‌లలో ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.  
 

click me!