లగ్జరీ ఇళ్లకు మంచి గిరాకీ...విల్లాలపై పెరుగుతున్న ఇష్టం...

By Sandra Ashok KumarFirst Published Feb 4, 2020, 10:35 AM IST
Highlights

 లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం అధిక శాతం మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మూడు రోజుల ప్రాపర్టీ షోను సందర్శించిన 50 వేలకుపైగా సందర్శకుల్ని గమనిస్తే ఈ సంగతి అవగతమవుతుంది. 
 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్లకు క్రమేణా గిరాకీ పెరుగుతున్నది. లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం అధిక శాతం మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మూడు రోజుల ప్రాపర్టీ షోను సందర్శించిన 50 వేలకుపైగా సందర్శకుల్ని గమనిస్తే ఈ సంగతి అవగతమవుతుంది. 

also read  కరోనా వైరస్ ప్రభావంతో రోజాపువ్వులకు భలే గిరాకీ...

60 శాతం మంది బహుళ అంతస్తులు, ఆకాశ హర్మ్యాల్లో నివసించడం మీదే దృష్టి కేంద్రీకరించారు. అదీ కూడా మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, చందానగర్‌, అప్పా జంక్షన్‌, మియాపూర్‌, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనడానికి అత్యంత ఆసక్తి చూపారని సమాచారం. 20 శాతం మంది విల్లాల కోసం వెతకగా, మరో ఇరవై శాతం అందుబాటు ధరల్లో దొరికే ప్రాజెక్టుల గురించి అన్వేషించడం కనిపించింది. ఇంకొందరు కొత్త ప్రాజెక్టుల వైపు చూశారు. 

‘ఇప్పటికే మాకో చిన్న ఇల్లు ఉన్నది. దానిపై గృహ రుణం తీరి పోయింది. ప్రస్తుతం ఇద్దరం పని చేస్తున్నాం. మా ఇద్దరి ఆఫీసులు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అందుకే అక్కడికి దగ్గర్లో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో ఫ్లాటు కొనడానికి వచ్చాం’ అని ఒక జంట పేర్కొంది. పిల్లల చదువులు, వివాహాలు, పదవీ విరమణ తర్వాత ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. 

అందుకే కొత్త ఫ్లాటైనా కొనడానికి ప్రయత్నిస్తున్నామని ఆ దంపతులు పేర్కొన్నారు. తమ బడ్జెట్‌ రూ.60 నుంచి రూ.70 లక్షలేనని ఆ దంపతులు తెలిపారు. మరికొందరేమో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి 10-15 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రాంతాల్లో నివసించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

చాలా మంది తాము కోరుకున్న బడ్జెట్‌లో అపార్టుమెంట్‌ వస్తుందంటే.. 20-25 నిమిషాల దూరమైనా ప్రయాణించడానికి సిద్ధమేనంటున్నారు. లగ్జరీ విల్లాలకు కూడా భాగ్యనగరంలో ఆదరణ పెరిగింది. ఇప్పటివరకూ వీటిని కొనడానికి కొనుగోలుదారులు పెద్దగా వచ్చేవారు కాదు. అలాంటిది ప్రాపర్టీ షోలో సుమారు 20 శాతం మంది సందర్శకులు కేవలం లగ్జరీ విల్లాల కోసం అన్వేషణ జరపడం కనిపించిందని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. 

also read ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

మాదాపూర్‌, గచ్చిబౌలిలకు కనీసం 15-20 నిమిషాల్లో చేరుకునేలా ఆధునిక గృహాలు ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని పలు భవన నిర్మాణ సంస్థలు ఖరీదైన లగ్జరీ విల్లాలే నిర్మిస్తున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు రూ.5 నుంచి 15 కోట్ల దాకా పలుకుతుండటం విశేషం. 

ఇంత ఖరీదైన ఇళ్లు కొనేవారు హైదరాబాద్‌లో ఉండటం విశేషమని పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల్ని కొనుగోలు చేయడానికి వేలాది సందర్శకులు విచ్చేయడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్ల కొనుగోలుకూ కొందరు ఆసక్తి చూపారు. 

click me!