అది ‘ఆర్థిక మరణ శిక్ష’వంటిదే: విజయ్ మాల్యా

Published : Apr 25, 2019, 09:47 AM IST
అది ‘ఆర్థిక మరణ శిక్ష’వంటిదే: విజయ్ మాల్యా

సారాంశం

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడం తనకు ఆర్థికంగా మరణ దండన విధించడమేనని మద్యం వ్యాపారి విజయ్ మాల్య ఆవేదన వ్యక్తం చేశారు.  

ముంబై: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించడం, తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ప్రత్యేక న్యాయస్థానం తనకు ‘ఆర్థిక మరణ శిక్ష’ విధించిందని మద్యం వ్యాపారి విజయ్ మాల్యా బాంబే హైకోర్టు ముందు వాపోయారు. 

గత ఆగస్టులో తీసుకువచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంలోని ప్రొవిజన్లను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. దాని విచారణ సందర్భంగా మాల్యా తన తరఫు న్యాయవాది ద్వారా ఈ వ్యాఖ్యలను ధర్మాసనానికి విన్నవించారు. 

‘నా రుణాలపై వడ్డీలు పేరుకుపోతున్నాయి. రుణాలు తీర్చడానికి సరిపడా ఆస్తులు ఉన్నా అందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. నా ఆస్తుల మీద నాకు అధికారం లేదు. ఇది నాకు ఆర్థిక మరణ శిక్ష విధించడం లాంటిది’ అని మాల్యా చెప్పారు. ఆయన ఆస్తుల  స్వాధీనానికి సంబంధించిన విచారణను నిలిపివేయాలని న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 

ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్ల కింద మాల్యాను ప్రత్యేక న్యాయస్థానం ఎఫ్ఈఓగా ప్రకటించింది. చట్టంలోని ప్రొవిజన్లను, ఎఫ్ఈఓగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో మాల్యా వేరువేరు పిటిష్లను దాఖలు చేశారు. మాల్యా తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ..ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్లు క్రూరమైనవన్నారు.

ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ‘ఈ చట్టాన్ని మాల్యా వంటి వ్యక్తుల కోసం సిద్ధం చేశారు. రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులను ఎగ్గొట్టిన ఎగవేతదారులను వెనక్కి తేవడానికి దీన్ని ఉపయోగిస్తారు’ అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్ల మీద మాల్యా చేసిన అభ్యర్థనపై స్పందించాలని ధర్మాసనం అటార్నీ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Swiggy Zomato Instamart Zepto లలో బుక్ చేసిన 10 నిమిషాల్లో ఫుడ్ ఎలా డెలివరీ చేస్తారో తెలుసా?
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ