
భారత్‌లో సైబర్ నేరాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. NCRB ప్రకారం, భారతదేశంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన 4,047 కేసులు, ATM మోసాలకు సంబంధించిన 2,160 కేసులు, క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలకు సంబంధించిన 1,194 కేసులు, OTP మోసాలు 1,093 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసిన మరో స్కామ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కొత్త స్కామ్‌లో, స్కామర్‌లు వారి విద్యుత్ బిల్లు బకాయి ఉందని లింక్‌తో వ్యక్తులకు SMS పంపుతారు. పొరపాటు ఎవరైనా ఆ లింక్‌పై క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి.
నిజానికి చాలా నెలల క్రితమే ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ స్కాం వెలుగు చూడటం విశేషం. సైబర్ క్రైమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జమ్తారా నుంచి ఈ విద్యుత్ బిల్లుల సైబర్ మోసం బయటపడింది. స్కామర్లు, వివిధ మార్గాల్లో సేకరించిన ఫోన్ నెంబర్లకు కరెంటు బిల్లు బకాయి ఉందని, వెంటనే క్లియర్ చేయాలని మెసేజ్ చేస్తారు. ఇందుకోసం మెసేజ్‌లను ప్రజలకు పంపేందుకు బల్క్ సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఈ ముఠా మొదట సిమ్ కార్డ్ విక్రేతలను సంప్రదించినట్లు సమాచారం తెలిసింది.
ఈ స్కామర్లు కస్టమర్ల డబ్బులను కొట్టేయడానికి ఒక బ్యాంకు ఖాతాను సృష్టించారు. తర్వాత, వారు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను చెల్లించాలని ప్రజలకు మెసేజ్ పంపారు.ఆ మెసేజ్ ఇలా ఉంది."డియర్ కస్టమర్, మీ గత నెల బిల్లు అప్‌డేట్ కానందున ఈ రాత్రికి మీ కరెంటు స్విచ్ ఆఫ్ చేయబడుతుందని. దయచేసి బిల్లు చెల్లించడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి." అని ఉంటుంది. అందులోనే పేమెంట్ గేట్ వే ఉంటుంది. పొరపాటున కస్టమర్లు ఈ ఉచ్చులో చిక్కి డబ్బులు పే చేశారో, వారి ఫోన్ హ్యాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు బ్యాంకు అకౌంట్లో డబ్బు కూడా కాజేసే ప్రమాదం ఉంది.
స్కామ్ గురించి తెలియని వ్యక్తులు తరచుగా వారి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా స్కామర్లు తయారుచేసిన వెబ్ సైట్ లోనే నమోదు చేస్తారు. డబ్బు కూడా నేరుగా ఖాతా నుండి డెబిట్ అవుతుంది. చాలా సందర్భాలలో, ఈ టెలికాలర్లు తరచుగా విద్యుత్ శాఖ అధికారుల వలె ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలను సైతం అడుగుతారు. దేశవ్యాప్తంగా విద్యుత్ బిల్లు సైబర్ స్కాం సంబంధించి వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇటీవలి నివేదికల ప్రకారం, ఈ విద్యుత్ బిల్లు స్కామ్‌తో ప్రజలను మోసగించినందుకు ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ 65 మందిని అరెస్టు చేసింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఇలాంటి స్కామ్ ఘటనలు ఎక్కువగా జరిగినట్లు చెబుతున్నారు.