Countries with No Rivers: ప్రపంచంలో నదులే లేని 7 దేశాల గురించి మీకు తెలుసా? అక్కడ తాగడానికి ఏ నీరు ఉపయోగిస్తారంటే?

Published : Jun 19, 2025, 04:53 PM IST
Vatican City

సారాంశం

మీకు తెలుసా? మన నివసిస్తున్న భూమిని నీటి గ్రహం అంటారని.. ఎందుకంటే ఈ భూమ్మీద మూడు వంతుల నీరే ఉంది. ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఇంత నీరున్నా అసలు నదులే లేని కొన్ని దేశాలున్నాయి. అవేంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మన చుట్టూ సముద్రం ఉన్నా మనిషి బతకడానికి ఆ నీరు ఎందుకూ ఉపయోగపడదు. కేవలం నదుల్లో ప్రవహించే నీరు, భూగర్భ జలాలు మాత్రమే మనుషులు, జంతువులు బతకడానికి పనికొస్తాయి. మరి అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? తాగడానికి నీరు లేకపోతే అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో అన్న అనుమానం కలుగుతోంది కదా.? ఆ దేశాల గురించి, వాటి నీటి వనరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మాల్దీవులు(Maldives)

హిందూ మహాసముద్రంలోని ద్వీప సమూహాలు ఈ మాల్దీవులు. ఇక్కడ లోతట్టు భౌగోళిక స్థితి కారణంగా అక్కడ నదులు ఏర్పడలేదు. ఈ దేశం ఎన్నో నీటి సవాళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్న మంచినీటి వనరులను కూడా మింగేసే పరిస్థితి ఏర్పడుతోంది. మాల్దీవుల ప్రజలు తమ అవసరాలను తీర్చడానికి వర్షపు నీటి పైనే ఆధారపడతారు. అదేవిధంగా డీశాలినేషన్ చేస్తుంటారు. పొరుగు దేశాల నుంచి వాటర్ బాటిల్స్ దిగుమతి చేసుకుంటారు. పరిరక్షణ, స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులు పాటిస్తూ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

కువైట్ (Kuwait)

కువైట్‌లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతమే. ఇక్కడ వాతావరణం చాలా ఎండగా, పొడిగా ఉంటుంది. వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి. కువైట్‌లో సగటు వర్షపాతం సంవత్సరానికి 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది. తక్కువ వర్షాల కారణంగా నీటి ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఈ దేశంలో చాలా అరుదు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీటిని నిల్వ చేసే ప్రాంతాలు లేవు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ మించి నమోదవుతాయి. అందువల్లనే నేలలో తేమ కూడా త్వరగా ఆవిరైపోతుంది.

కువైట్ తమ నీటి అవసరాలను ప్రధానంగా సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం(డీశాలినేషన్‌) ద్వారా తీర్చుకుంటుంది. ఈ దేశంలో ఉన్న డీశాలినేషన్‌ ప్లాంట్లు ప్రపంచంలో అత్యంత పెద్దవి, మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించినవి. ఇక్కడ వర్షాలు పడినప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా వర్షపు నీటిని నిల్వ చేసి తర్వాత ఉపయోగించుకుంటారు.

వాటికన్ సిటీ(Vatican City)

ప్రపంచంలోని అతి చిన్న స్వతంత్ర రాష్ట్రమైన వాటికన్ సిటీలో నదులు లేవు. కనీసం దాని సరిహద్దుల్లో కూడా నదులు లేకపోవడంతో ఇటలీ దేశ నీటి సరఫరాపై ఆధారపడి ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు. విస్తీర్ణంలో చాలా చిన్నగా ఉన్నప్పటికీ, స్థిరమైన నీటి వినియోగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ దేశం అనేక ఇబ్బందులు పడుతోంది. నీటి పొదుపు ఫిక్చర్‌ల ఏర్పాటు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఈ దేశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా నీటి పొదుపు చర్యలు పాటించాల్సి ఉంటుంది.

సౌదీ అరేబియా (Saudi Arabia)

సౌదీ అరేబియాలో ఎటువంటి పర్మనెంట్ నదులు లేవు. దీనికి ప్రధాన కారణాలు అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులు. అక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఎందుకంటే సౌదీ అరేబియా ఎడారి ప్రాంతం. అక్కడి వాతావరణం చాలా ఎండగా, పొడిగా ఉంటుంది. అందువల్ల అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. దాదాపు 95% దేశం ఎడారిగా మారిపోయింది. అందువల్లనే ఆ దేశంలో నదులు లేవు. 

సౌదీ అరేబియాలో సాధారణంగా వర్షం కురవడం చాలా తక్కువ. ఇక్కడ సగటు వర్షపాతం సంవత్సరానికి 100 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల నీటి ప్రవాహం ఉండదు. కురిసిన వర్షం కూడా కేవలం గంటల్లోనే ఆవిరైపోతుంది.

సౌదీ అరేబియాలో ప్రజలు ప్రధానంగా భూగర్భ జలాలు, డీశాలినేషన్‌ (ఉప్పు నీటిని శుద్ధి చేయడం) పద్ధతులపై ఆధారపడుతున్నారు. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చుకుంటున్నారు.

సౌదీ అరేబియాలో తాత్కాలిక నీటి ప్రవాహాలు ఉన్నాయి. వాటిని "వాడిస్" అని పిలుస్తారు. ఇవి వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయి. వర్షం కురిసిన తర్వాత కొద్ది సేపట్లోనే అవి ఆవిరైపోతాయి.

బహరైన్ (Bahrain)

బహరైన్ పెర్షియన్ గల్ఫ్‌లోని ఒక ద్వీప దేశం. ఇక్కడ సహజ నదులు లేవు. కానీ అనేక నీటి గుంటలు, భూగర్భజల వనరులు ఉన్నాయి. అయితే ఇవి దేశ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. అందుకే డీశాలినేషన్‌పై వారంతా ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇలా వారు మంచినీటిలో 60% పైగా డీశాలినేషన్ ద్వారా పొందుతారు. ఈ ప్రభుత్వం నీటి పొదుపు పద్ధతులు, సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది.

ఖతార్(Qatar)

అరేబియా ద్వీపకల్పంలో ఉన్న చిన్నదైన ఈ దేశం సంపదలో మాత్రం చాలా ధనిక దేశం. ఎంత డబ్బున్నాఇక్కడ నదులు లేవు. దేశం నీటి సరఫరా దాదాపు పూర్తిగా డీశాలినేషన్ ప్లాంట్ల నుండే వస్తుంది. ఇది తాగునీటిలో 99% పైగా అందిస్తుంది. ఖతార్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగ రేటును కలిగి ఉంది. నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీటి పొదుపు పథకాల కోసం ప్రజల నుంచే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

ఒమాన్ (Oman)

అరేబియా ద్వీపకల్పంలోని ఆగ్నేయ తీరంలో ఒమన్‌ దేశం ఉంది. ఇక్కడ శాశ్వత నదులు లేవు. కానీ అనేక చెరువుల్లాంటి కుంటలు ఉన్నాయి. వర్షాల సమయంలో నీటితో నిండుతాయి. ఒమన్ భూగర్భ జలాల రీఛార్జ్ కోసం వీటిని ఉపయోగిస్తుంది. ఈ దేశం కూడా డీశాలినేషన్‌పై ఆధారపడుతుంది. దాని నీటి వనరులను సమర్ధవంతంగా నిర్వహించడానికి అధునాతన నీటిపారుదల పద్ధతులను అమలు చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది