
టాటా మోటార్స్ ఇటీవల పరిచయం చేసిన హ్యారియర్ EV AWD మోడల్ 'క్వాడ్ డే' అనే ప్రత్యేక ఈవెంట్‌లో తన సత్తా చాటింది. రోడ్డు ఎలా ఉన్నా తన శక్తివంతమైన పనితీరుతో ఈజీగా గమ్యస్థానం చేరింది. ఇప్పటి వరకు వచ్చిన ఏ హ్యారియర్ వెర్షన్‌లోనూ ఇంత పనితీరు కనిపించలేదు. రెండు మోటార్లను కలిగి ఉండే ఈ కారు ముందు, వెనుక యాక్సిల్స్ పై మోటార్లతో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థ కలిగి ఉండటం ప్రత్యేకత.
టాటా హ్యారియర్ EV AWDలో ముందు, వెనుక మోటార్లు ఉన్నాయి. వెనుక భాగంలో ఉన్న పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 238 హెచ్‌పీ ఉత్పత్తి చేస్తుంది. ముందుభాగంలో ఉన్న ఇండక్షన్ మోటార్ 158 హెచ్‌పీ శక్తి ఇస్తుంది. అయితే బ్యాటరీ డిశ్చార్జ్ సామర్థ్యం ఆధారంగా ఇవి రెండూ కలిపి మాక్సిమం 313 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. గరిష్ట టార్క్ 540Nm. ఈ మోటార్లు 75kWh బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతాయి.
'క్వాడ్ డే' ఈవెంట్‌లో మొదటగా రాళ్లు తేలిన మార్గంపై 'ఆఫ్ రోడ్ అసిస్ట్' ఫీచర్‌ను పరీక్షించారు. ఇది ఒకరకంగా ఆఫ్‌రోడ్ క్రూజ్ కంట్రోల్‌గా పనిచేస్తుంది. ఇందులో 5 కి.మీ. వేగంతో కూడా వాహనం స్థిరంగా నడిచింది. హ్యారియర్ EVలో కొత్తగా అందించిన 'ఆల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్', ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపర్స్ వల్ల ప్రయాణం సాఫీగా సాగింది.
ఇతర మోడల్స్ తో పోల్చితే టాటా హ్యారియర్ EV లో వచ్చే ఎక్ట్రా ఫీచర్స్ బాగున్నాయి. ముఖ్యంగా 34 డిగ్రీల ఎత్తైన 'బ్రిడ్జ్' ను కూడా హ్యారియర్ EV ఏ మాత్రం తడబడకుండా ఎక్కింది. మధ్యలో ఆగినప్పుడు హిల్ హోల్డ్ అసిస్టును పరీక్షించగా, కారు స్టాండర్డ్ గా నిలిచి ఉంది.
తర్వాత 'సాండ్ పిట్' అనే ఇసుక గుంటను దాటించేందుకు 'సాండ్' మోడ్‌ను ఉపయోగించారు. ఇది ముందు, వెనుక మోటార్లకు శక్తిని సమానంగా పంపుతుంది. శక్తిని స్వయంగా బదిలీ చేస్తూ ESC కలిగిన నియంత్రణను కలిగి ఉండే ఈ మోడ్ వాహనాన్ని సులభంగా దాటించగలిగింది.
టాటా మోటార్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వివరాలు వెల్లడించకపోయినా సుమారు 200mm ఉండవచ్చని అంచనా. ఎందుకంటే 'క్యామెల్ హంప్' అనే అడ్డంకిని దాటేటప్పుడు కారు బ్యాటరీ తక్కువగా నేలని తాకినట్లుగా కనిపించింది. ఆ తరువాత 'స్లష్ పిట్', స్టెయిర్ క్లైంబింగ్ వంటి దారుల్లో కూడా హ్యారియర్ EV విజయవంతంగా నడిచింది.
ఆన్-రోడ్ డెమో, ప్రదర్శన ఈవెంట్‌లో హ్యారియర్ EV 24 టన్నుల ఆర్మీ ట్రక్‌ని ఈజీగా లాగేసింది. ఈ ఈవెంట్ లో నాలుగు హ్యారియర్ EV కార్లు J-టర్న్ చేయడం వంటి విన్యాసాలు చేసి చూపించాయి.
టాటా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం హ్యారియర్ EV 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరగలదు. ఈ ఫీచర్ వల్ల ఇండియాలో తయారైన వేగవంతమైన కారుగా టాటా హ్యారియర్ EV నిలిచింది. అదేవిధంగా బిఐసీ ట్రాక్‌పై 160 కి.మీ. వేగం సాధించగలిగింది.
ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్: ఇది రోడ్డు వేగ పరిమితిని చదివి, డ్రైవర్‌కి వేగాన్ని తగ్గించమని సూచిస్తుంది.
ఆటో పార్కింగ్ అసిస్ట్: డ్రైవింగ్, బ్రేక్, స్టీరింగ్‌ను స్వయంగా నియంత్రిస్తూ వాహనాన్ని పార్క్ చేస్తుంది.
రివర్స్ అసిస్ట్: చివరి 50 మీటర్ల ప్రయాణాన్ని గుర్తుంచుకొని వెనక్కి తిరగడంలో సహాయపడుతుంది.
డిజిటల్ మిర్రర్: రూఫ్-మౌంటెడ్ కెమెరా ద్వారా వస్తువుల దృశ్యాలను ప్రదర్శిస్తుంది.
ట్రాన్స్‌పరెంట్ బోనెట్: ఫ్రంట్ కెమెరా డేటాను ఉపయోగించి వాహనముందు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది.
ప్రస్తుతం టాటా కంపెనీ 65kWh బ్యాటరీ, ఒక్క మోటార్ ఉన్న బేస్ వేరియంట్ ధరను మాత్రమే ప్రకటించింది. దీని ధర రూ.21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండు మోటార్లతో కూడిన టాప్ మోడల్ హ్యారియర్ EV QWD ధర రూ.30 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా.
ఇది మార్కెట్లోకి వచ్చే Mahindra XUV.e9 వంటి వాటికి గట్టి పోటీదారుగా ఉండనుంది. అయితే AWD టెక్నాలజీ ఈ కారుకు ప్రత్యేకతనిస్తుంది.
మొత్తంగా టాటా హ్యారియర్ EV AWD మోడల్‌ను ఆఫ్‌రోడ్, టెక్ డెమోల ద్వారా సమగ్రంగా పరీక్షించారు. దాని సామర్థ్యాన్ని బాగా ఆవిష్కరించారు. ఫ్యూచర్‌లో దీని రియల్ వరల్డ్ పనితీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.