Beekeeping Business: సొంత ఊర్లో చేసే బిందాస్ బిజినెస్: తేనెటీగల పెంపకం ద్వారా రూ.లక్షల్లో ఆదాయం.. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇవిగో

Published : Jun 19, 2025, 12:53 PM IST
bee boxes

సారాంశం

సొంత ఊర్లోనే ఉండాలనుకొనే వారికి మంచి ఆదాయాన్నిచ్చే బిజినెస్ తేనెటీగల పెంపకం. తక్కువ పెట్టుబడి, శ్రమ ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ చక్కటి మార్గం. ఇందులో లాభనష్టాలు, కష్టసుఖాలు, డెవలప్‌మెంట్‌కి ఉన్న అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

ఈ కాలంలో ఉద్యోగాలు అంత సులభంగా దొరకడం లేదు. ఒకవేళ దొరికినా చాలీచాలని జీతం, సిటీల్లో ఖర్చులు ఎక్కువ. జాబ్స్ కూడా ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది యువత తమ గ్రామాల్లోనే ఉండి ఏదో పనిచేస్తూ జీవించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారం తేనెటీగల పెంపకం. ఇది ఒకసారి నేర్చుకుంటే మళ్లీ ఎక్కువగా ఖర్చు ఉండదు. తేనెతో పాటు వాటి నుండి వచ్చే ఇతర ఉత్పత్తులు మార్కెటింగ్ చేసి మంచి ఆదాయం సంపాదించొచ్చు. 

తేనెటీగల పెంపకం అంటే ఏమిటి? 

తేనెటీగలు పూల నుంచి తేనె సేకరించి పెట్టెల్లో నిల్వ చేస్తాయి. మనం వాటిని సరైన పద్ధతిలో పెంచితే, తేనెను సేకరించి అమ్ముకోవచ్చు. ఒక పెట్టె నుంచి సగటున సంవత్సరానికి 8 నుంచి 10 కిలోల తేనె వస్తుంది.

తేనెటీగల పెంపకానికి అవసరమైనవి

తేనెటీగ పెట్టెలు (Bee Boxes)

తేనెటీగ కాలనీలు (Bee Colonies)

తేనె సేకరించే సామాగ్రి

శిక్షణ (ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా)

తేనెటీగల పెంపకంలో లాభాలు ఎలా వస్తాయి? 

ఒక కిలో తేనె మార్కెట్లో రూ.300 నుంచి రూ.800 వరకూ అమ్ముడవుతుంది. ఒరిజినల్ ఫారెస్ట్ హనీ అయితే రూ.1000 వరకూ పోతుంది. ఒక యూనిట్ (10 పెట్టెలు) నుండి సంవత్సరానికి కనీసం 80-100 కిలోల తేనె వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కనీసం రూ.30,000-రూ.60,000 ఆదాయం రావచ్చు. మీరు ఎన్ని యూనిట్లు పెట్టుకుంటే అంత ఆదాయం ఎక్కువగా వస్తుంది. 

ఉదాహరణకు మీరు 100 పెట్టెలతో తేనెటీగల పెంపకం స్టార్ట్ చేస్తే సంవత్సరానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఇది కేవలం తేనే సేకరణ ద్వారా మాత్రమే. ఇందులో వచ్చే బై ప్రోడెక్ట్స్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. ఈ బిజినెస్ లో ఎంత ఎక్కువ చేయగలిగితే అన్ని రూ.లక్షల ఆదాయం వస్తుంది. 

తేనెటీగల పెంపకానికి పెట్టుబడి ఎంత పెట్టాలి? 

తేనెటీగల పెంపకం ప్రారంభం చేయాలంటే కనీసం రూ.50,000 అవసరం. ఇందులో పెట్టెలు, తేనెటీగలు, ఉపకరణాలు, శిక్షణ ఖర్చులు వుంటాయి. కానీ ఇది ఒకసారి పెట్టుబడి మాత్రమే. తరువాత సంవత్సరాల్లో మాత్రం ఖర్చు తక్కువగా ఉంటుంది. లాభం ఎక్కువగా ఉంటుంది.

తేనెటీగల పెంపకంలో ఉన్న కష్టాలు

వర్షాకాలంలో తేనెటీగలు తక్కువగా పని చేస్తాయి.

తేనెటీగల పెంపకంలో సరైన శిక్షణ తీసుకోకపోతే తేనెటీగలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.

కొన్ని తెగుళ్లు వస్తే, కాలనీలు నష్టపోవచ్చు.

పురుగుల మందులు వాడే పొలాల దగ్గర పెంచితే తేనెటీగలకు హాని జరుగుతుంది.

గ్రామాల్లో తేనెటీగలు పెంచడం మంచిదా? 

గ్రామాల్లో పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. పంటలు, వనమూలికలు ఉండే ప్రాంతాల్లో తేనెటీగలు బాగా పెరుగుతాయి. అందువల్ల ఈజీగా తేనెటీగలు పెరుగుతాయి. తేనె సేకరణ కూడా త్వరగా, ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా పల్లెల్లో పూల మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల తేనెటీగల పరిశ్రమ పల్లెల్లోనే నిర్వహించగలం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కూడా ఇందులోనే వస్తాయి. అదనంగా తేనెటీగలు పంటలకి ఎంతో మేలు చేస్తాయి. అంటే పంట దిగుబడులు పెరగడానికి సహాయపడతాయి.

పట్టణాల్లో తేనెటీగల పెంపకం సొంతంగా చేయచ్చా? 

పట్టణాల్లో తేనెటీగలు పెంచాలంటే స్థలం ఎక్కువ అవసరం. ఎక్కువ కాలనీలు పెంచాలంటే ఒకటిన్నర గుంట భూమి అవసరం. అలాగే తేనె అమ్మడానికి మార్కెట్ అందుబాటులో ఉంటుంది. కాని పొల్యూషన్, పూల మొక్కలు తక్కువగా ఉండటం ఇలాంటి కారణాల వల్ల పట్టణాల్లో తేనెటీగల పెంపకం కష్టంగా ఉంటుంది. అందుకే తేనెటీగల పెంపకం ఎక్కువగా గ్రామాల్లోనే అనుకూలం.

తేనెటీగల వ్యాపారం అంటే కేవలం తేనెనేనా? 

తేనెటీగల పెంపకం అంటే కేవలం తేనె సేకరించడం కాదు. తేనెతో పాటు, తేనెటీగ మైనం(Bee Wax), రాయల్ జెల్లీ, ప్రోపోలిస్, పాలోన్ కూడా వస్తాయి. వీటికి ఆయుర్వేద పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆయా పరిశ్రమలకు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా తేనెను బ్రాండెడ్ బాటిల్స్‌లో అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి 

భారత్‌లో 2024 నాటికి సుమారు 11 లక్షల తేనెటీగ కాలనీలు ఉన్నాయి.

భారతదేశం తేనె ఉత్పత్తిలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.

2023లో భారత్‌ నుంచి 74,000 మెట్రిక్ టన్నుల తేనె ఎగుమతి అయింది.

ప్రైవేట్ హనీ కంపెనీలు రూ. 300 కోట్లు దాటి వ్యాపారం చేస్తున్నాయి.

తేనెటీగల పెంపకం ఎలా నేర్చుకోవాలి? 

ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఖరారైన NGOs ఉచిత శిక్షణ ఇస్తాయి. అంతేకాకుండా పెట్టుబడికి సహాయంగా పలు  రకాల స్కీమ్‌లు కూడా ఉన్నాయి. NABARD, MSME వంటి సంస్థల ద్వారా లోన్, సబ్సిడీలు కూడా లభిస్తాయి.

పల్లెటూరు యువతకు చక్కటి అవకాశం

తేనెటీగల పెంపకం పల్లెటూరు యువతకి ఒక చక్కటి ఆదాయ మార్గం. గ్రామంలోనూ ఉంటూ తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ఇది మంచి అవకాశం. అయితే దీనికోసం కష్టపడాలి, తేనెటీగల పెంపకంపై బాగా అవగాహన పెంచుకోవాలి. లోటుపాట్లు తెలుసుకోవాలి. నిలకడగా చేస్తే ఈ వ్యాపారంలో మంచి ఆదాయం పొందొచ్చు. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం అందే అవకాశముంది. ప్రకృతి దగ్గరగా ఉండే ఈ వ్యాపారం చేసే వారి ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రజలకు నాణ్యమైన తేనె అందించొచ్చు. పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?