కరోనా దెబ్బకి రైడ్ షేరింగ్ సర్వీసులకు ఓలా అండ్ ఉబెర్ ‘గుడ్ బై’...

By Sandra Ashok KumarFirst Published Mar 21, 2020, 1:54 PM IST
Highlights

క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఉబెర్ సంస్థలు షేరింగ్ సర్వీసులకు తాత్కాలికంగా స్వస్తి పలికాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సర్వీసులు నడుపాలా? లేదా? అన్న సంగతి నిర్ణయించుకోలేదని ఓలా తెలిపింది. 
 

న్యూఢిల్లీ: దేశంలోకి క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఉబెర్ వైరస్ కట్టడి దిశగా ఒక అడుగు ముందుకేశాయి. 

సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ‘పూల్ రైడ్’ లేదా ‘పూల్ సర్వీస్’ వసతిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీని ప్రకారం ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసుల్లో ఒకరు గానీ, ఒకే కుటుంబానికి చెందిన వారు గానీ ప్రయాణించవచ్చు. 

గత కొన్ని రోజులుగా ‘పూల్ సర్వీస్’కు డిమాండ్ బాగా తగ్గిపోయిందని ఉబెర్, ఓలా సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పూల్ రైడ్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. 

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

అలాగే క్యాబ్ సర్వీసుల్లో పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసుల యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదని క్యాబ్ సర్వీసు సంస్థలు చెబుతున్నాయి. 

తత్ఫలితంగా క్యాబ్ సర్వీసులకు డిమాండ్ బాగా తగ్గిపోయినట్లు ఆ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మైక్రో, మినీ, ప్రైమ్ సర్వీసుల్లో రెంటల్, ఔట్ స్టేషన్ సర్వీసులు అందిస్తున్నట్లు ఓలా తెలిపింది. సాధారణ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఉబెర్ సూచించింది. 

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం దేశీయంగా క్యాబ్ సర్వీసులపై ప్రభావం పడుతుందని ఓలా, ఉబెర్ సంస్థలు పేర్కొన్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రదాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

also read స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు...సెబీ ఆంక్షలు...

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సర్వీసులు నడుపాలా? వద్దా? అన్న సంగతిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు. దేశవ్యాప్తంగా 250 నగరాల పరిధిలో ఓలాతోపాటు ఉబెర్ సంస్థలు ఫోర్ వీలర్, టూ వీలర్ టాక్సీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. 

ఉబెర్, ఓలా సంస్థలు దేశవ్యాప్తంగా 30 లక్షల మంది డ్రైవర్లకు పైగా ఉపాది కల్పిస్తున్నాయి. మెట్రో పాలిటన్ నగరాలైన బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ తదితర సిటీల్లో ఈ సేవలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.

2019 ప్రారంభంలో నిర్వహించిన అంచనా ప్రకారం దేశంలోని ఐదు ప్రధాన మెట్రో పాలిటన్ నగరాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నైలకు 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి మధ్య 13 లక్షల మంది వలస వచ్చారని అంచనా. 
 

click me!