ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు...దశాబ్ద కనిష్టానికి వృద్ధిరేటు...

By Sandra Ashok KumarFirst Published Mar 3, 2020, 10:40 AM IST
Highlights

భారత ఆర్థిక వ్యవస్థను కరోనా కష్టాలు వీడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసే త్రైమాసికంలో జీడీపీ 20 శాతం తగ్గొచ్చునని యూబీఎస్ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. వార్షిక జీడీపీ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. మరో రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కూడా జీడీపీపై పెదవి విరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 4.9 శాతమేనని తేల్చేసింది.

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా తయారవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలూ తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దకాలం కనిష్ఠ స్థాయిలో ఐదు శాతంగా నమోదు కావచ్చని గణాంకాలు చెప్తున్నాయి. కానీ కరోనా దెబ్బకు ఇంకా తగ్గిపోవచ్చని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అసలే మందగమనంతో సతమతమవుతున్న భారత జీడీపీని ఇప్పుడు కరోనా వైరస్‌ కాటేస్తున్నది మరి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో గత మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిరేటు క్రమేణా క్షిణించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడీపీ ఏడేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.7 శాతానికే పరిమితమైంది. ఈ క్రమంలో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు మరింత పడిపోయే వీలుందని, అంటువ్యాధి ప్రభావంతో 0.20 శాతం దిగజారే వీలుందని సోమవారం యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తమ తాజా నివేదికలో అంచనా వేసింది.

also read చెక్ పోస్టులు దాటాలంటే రూ.48 వేల కోట్ల లంచం

చైనాలో కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో భారతీయ తయారీ రంగం కుదేలవుతున్నది. దేశ జీడీపీలో సేవా రంగం తర్వాత తయారీ రంగానిదే అగ్రభాగం. భారత ఉత్పాదక రంగానికి మూల వనరుగా చైనాయే. డ్రాగన్ నుంచే కీలక రంగాలన్నింటికి ముడి సరుకు అందుతున్నది.

కానీ  కరోనా తీవ్రతకు చైనా కర్మాగారాలన్నీ మూతబడ్డాయి. దీంతో అక్కడి నుంచి వచ్చే విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా భారత్‌లో తయారీ మందగిస్తున్నది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతున్నది. 

మిగతా రంగాలపైనా కరోనా ఛాయలు కనిపిస్తుండగా, ఇది జీడీపీని కుంగదీస్తున్నదని యూబీఎస్‌ తెలిపింది. ‘భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. 0.2 శాతం మేర ప్రభావితం కావచ్చన్నది ప్రాథమిక అంచనా’ అని యూబీఎస్‌ వ్యాఖ్యానించింది.

ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 4.9 శాతంగానే ఉండొచ్చని మరో రేటింగ్ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది. దేశీయ మార్కెట్‌లో పడిపోయిన డిమాండ్‌, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి ముడి సరుకు సరఫరా ఇబ్బందుల మధ్య గత అంచనాలను సోమవారం సవరించింది.

 ఇంతకుముందు భారత జీడీపీ 5.1 శాతంగా ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) అంచనాలకూ ఫిచ్‌ కోత పెట్టింది. 5.9 శాతం నుంచి 5.4 శాతానికి కుదించింది. మరోవైపు యూబీఎస్‌ సైతం 5.7 శాతం నుంచి 5.6 శాతానికి దించింది. 

also read క్రూడ్ ధర తగ్గినా.. దేశీయంగా తగ్గని పెట్రోల్ ప్రైస్

మందగమనంలో ఉన్న దేశ జీడీపీకి కేంద్ర బడ్జెట్‌ ఊతం ఇవ్వలేక పోయిందని ఫిచ్‌ పెదవి విరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత నెల ఒకటో తేదీన పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉత్సాహం నింపలేకపోయిందని, దీనివల్లే వృద్ధిరేటుకు కోత పెట్టాల్సి వస్తుందని ఫిచ్‌ చెప్పింది. 

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయని, ఈ ప్రభావం పరిశ్రమపై పడుతున్నదని, ఇందుకు బడ్జెట్‌ పరిష్కారం చూపలేకపోయిందని ఫిచ్ విమర్శించింది. కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే గడగడలాడిస్తున్నది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇతర దేశాలకూ వేగంగా విస్తరిస్తుండటంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలూ ప్రభావితమవుతున్నాయి. 

ఈ క్రమంలో ప్రపంచ జీడీపీ ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని గ్లోబల్‌ ఏజెన్సీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) అంచనా వేసింది. వైరస్‌ అదుపులోకి రాకపోతే 1.5 శాతానికి పతనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే కరోనా సృష్టిస్తున్న బీభత్సం ఎక్కువని చెప్పింది.

click me!